
Bengaluru: పాఠశాల ఆవరణలో విద్యార్థులను చెట్టుకు కట్టేసి..
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ముఠా పిల్లలపై పైశాచికత్వానికి పాల్పడింది. ముగ్గురు విద్యార్థులను చెట్టుకు కట్టేసి వారిని కొడుతూ బలవంతంగా ధూమపానం చేయించారు. తమను విడిచిపెట్టాలని ఆ చిన్నారులు మొరపెట్టుకున్నా వారు కనికరించలేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తూర్పు బెంగళూరులోని మహదేవపురాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మైదానంలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న ఓ గ్యాంగ్ ఐదో తరగతి చదువుతున్న ముగ్గురు పిల్లలను పట్టుకొని (11-13 ఏళ్లలోపు వారు) చెట్టుకు కట్టేశారు. వారితో బలవంతంగా బీడీలు తాగించారు. తమను విడిచిపెట్టాలని ఏడ్చి మొరపెట్టుకున్నా ఆ ముఠా కనికరం చూపలేదు. సాయంత్రం ఎప్పుడో వదిలేయడంతో ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు స్థానిక కార్పొరేటర్ వద్దకు చేరుకొని తమ పిల్లలకు రక్షణ లేకుండాపోయిందని భయాందోళన వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేటర్ సాయంతో పోలీసులను ఆశ్రయించారు.
వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు వివేక్ (18) మినహా మిగతా ఐదుగురు మైనర్లేనని తెలిపారు. అందులో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పెట్రోలింగ్‌ను పెంచుతామని పోలీసు ఉన్నతాధికారి డి.దేవరాజ్ వెల్లడించారు. వివేక్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మిగతా నిందితులపై జువైనల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఇవీ చదవండి
Advertisement