
మల్లాపూర్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
మల్లాపూర్: మేడ్చల్ జిల్లా పరిధిలో మల్లాపూర్ పారిశ్రామికవాడలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుర్చీల తయారీకి సంబంధించిన రెండు పరిశ్రమల్లో భారీగా మంటలు చెలరేగాయి. పరిశ్రమల్లో చేపట్టిన మరమ్మతు పనుల్లో భాగంగా వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా నిప్పురవ్వలు పక్కనే ఉన్న రసాయన డబ్బాలపై పడి మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సంభవించిన పరిశ్రమ పక్కనున్న రసాయన పరిశ్రమలకు మంటలు వ్యాపిస్తుండటంతో.. ఆయా పరిశ్రమలకు చెందిన కార్మికులు రసాయనిక ముడిపదార్థాలను బయటకు తరలించారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో పరిశ్రమ నుంచి కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని ఐదు శకటాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుర్చీల పరిశ్రమలో ప్లాస్టిక్ ఎక్కువగా ఉండటంతో మంటలు త్వరగా అదుపులోకి రావడం లేదని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు.