ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ సభ్యుల పరస్పర దాడి

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని అఖిలభారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల మధ్య జరిగిన కొట్లాటలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. దిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి నిరసనగా ..

Updated : 08 Jan 2020 01:59 IST

10 మందికి గాయాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని అఖిలభారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల మధ్య జరిగిన కొట్లాటలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. దిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి నిరసనగా అహ్మదాబాద్‌లోని ఏబీవీపీ కార్యాలయం ఎదుట ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలు వీరిపై దాడికి దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది. 

మరోవైపు ఈ దాడిని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు నీరజ్‌కుందన్‌ తీవ్రంగా ఖండించారు. భాజపా నిరంకుశ ప్రవర్తన ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భాజపా నిజరూపం ఇప్పుడు బయటపడింది. ఆ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తోంది’’ అని ఆరోపించారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై దాడిని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. నేరస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ‘‘ ఇది ఏబీవీపీ గూండాలు చేసిన దుశ్చర్య. దీనిలో వారి అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. అమాయక విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని భాజపా ఎలా సమర్థిస్తుంది. భారత్‌ను రణక్షేత్రంగా తయారు చేస్తున్నారు’’ అని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

ఆదివారం రాత్రి దిల్లీ జేఎన్‌యూలో జరిగిన దుండగుల దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ సహా మరో 34 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఏబీవీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది.


 

 

 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని