సూట్‌కేసులో ప్రియుడి మృతదేహం

అమెరికాలో ఉంటున్న జంట ఓ రోజు ఆనందంగా గడిపింది. మరుసటి రోజు ప్రియుడు మాత్రం అనుమానాస్పదస్థితిలో సూట్‌కేసులో మృత్యువై ఉన్నాడు. ..

Published : 29 Feb 2020 00:27 IST

ఫ్లోరిడా: అమెరికాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే అతడి ప్రేయసిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు వింత సమాధానం వచ్చింది. దాగుడుమూతలు ఆడే క్రమంలోనే తన ప్రియుడు మరణించాడని చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతయ్యింది. 

ఫ్లోరిడా వింటర్‌ పార్క్‌లో నివసిస్తున్న సారా బూనే అనే మహిళ తన ప్రియుడు జార్జ్‌ టొర్రెస్‌ (42) మరణించాడని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసులో ఉన్న ప్రియుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో బూనేను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘రాత్రి ఇద్దరం సరదాగా గడుపుతున్న సమయంలో ఓ బ్యాగులో ఉండి దాగుడుమూతలు ఆడుకుంటే ఫన్నీగా ఉంటుందని అనుకున్నాం. దీనికి ఒప్పుకున్న ప్రియుడు టొర్రెస్‌ సూట్‌కేసులో దూరాడు. నేను అంతస్తుకి వెళ్లి నిద్రపోయాను. ఉదయాన్నే లేచి సూట్‌కేసుని తెరచి చూసే సరికి టొర్రెస్‌ అపస్మారకస్థితిలో ఉండటం గమనించాను’’ అని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు ఆ మహిళ  మొబైల్‌ను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న వీడియోలను పరిశీలించారు. సూట్‌కేసులో ఉన్న ప్రియుడు సాయం కోసం అరుస్తున్నట్లు ఆ వీడియోల్లో ఉందని గమనించారు. టొర్రెస్‌ సూట్‌కేసునుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రేయురాలు నవ్వుతూ..నువ్‌ నన్ను మోసం చేసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించిందనే వాదనలు వినిపించాయని పోలీసులు చెబుతున్నారు.  

ఇదిలా ఉంటే, దాగుడుమూతలు ఆడే సమయంలోనే తన ప్రియుడు మరణించాడని చెబుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం ప్రేయసిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని