
కాబూల్‌లో ఉగ్రదాడి.. 11 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారలో కొందరు ముష్కరులు జరిపిన దాడిలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45 నిమిషాలకు ఇక్కడి షోర్ బజార్‌లోని గురుద్వారలో ఈ ఘటన జరిగింది. సుమారు 150 మంది ప్రార్థన చేస్తుండగా.. ఆయుధాలు, బాంబులు ధరించిన కొందరు ముష్కరులు లోపలికి ప్రవేశించారు. ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. మరో ముగ్గురు కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. 11 మంది చిన్నారులను గురుద్వార నుంచి పోలీసులు సురక్షితంగా కాపాడారు.
గురుద్వారపై జరిగిన దాడి ఘటనను భారత్ ఖండించింది. కొవిడ్-19తో ప్రపంచం సతమతమవుతున్న వేళ ఇలాంటి దాడులు జరపడం క్రూరమైన చర్యగా అభివర్ణించింది. అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కుల రక్షణకు అవసరమైన సాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశించింది. రెండేళ్ల క్రితం సైతం అఫ్గానిస్థాన్‌లో సిక్కులపై జరిగిన దాడి ఘటనలో 19 మంది చనిపోయారు.