రెండు నెలలుగా ఎయిర్‌పోర్టులోనే నేరస్థుడు!

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత్‌లో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దిల్లీ విమానాశ్రయంలో ఓ అరుదైన సంఘటన జరిగింది.

Published : 12 May 2020 01:10 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత్‌లో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఓ నేరస్థుడు దిల్లీ విమానాశ్రయంలోనే గడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనుకోకుండా ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి.. గత 50రోజులుగా విమానాశ్రయంలోనే గడుపుతున్నాడు. అతని పూర్తి వివరాలు సేకరించగా అతడో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అని తేలింది.

జర్మనీకి చెందిన ఎడ్‌గార్డ్‌ జైబాట్‌ అనే 40ఏళ్ల వ్యక్తి మార్చి 18న వియాత్నం నుంచి భారత్‌ మీదుగా ఇస్తాంబుల్‌ బయలుదేరాడు. మార్గమధ్యంలో దిల్లీ విమానాశ్రయం చేరుకున్న సమయంలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో టర్కీకి రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని రకాల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో విమానాశ్రయంలో చిక్కుకున్న కొందరి విదేశీ ప్రయాణికులకు వారి రాయబార కార్యాలయాలు తోడ్పాటునందించాయి. కానీ జర్మనీకి చెందిన జైబాట్‌ మాత్రం దిల్లీ విమానాశ్రయంలోనే ఉండిపోయాడు. ఇది గమనించిన విమానాశ్రయ సిబ్బంది జర్మనీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా అతడో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అని తేలింది. దాడులతో పాటు ఇతర నేరపూరిత కేసులు అతడిపై ఉన్నట్లు వెల్లడించింది. దీంతో జర్మనీ రాయబార కార్యాలయం అతడికి సహకరించకపోగా.. విదేశంలో ఉన్న కారణంగా అతడిని కస్టడీలోకి తీసుకునేందుకు నిరాకరించింది.

విమానాశ్రయం నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా వీసా ఉండాలి. కానీ అతనికున్న నేరచరిత్ర కారణంతో భారత్‌ కూడా వీసా ఇవ్వలేదు. దీంతో గత 50రోజులుగా దిల్లీ విమానాశ్రయంలోనే ఉండిపోయాడని అక్కడి సిబ్బంది వెల్లడించారు. టెర్మినల్‌లో ఉన్న ఫుడ్‌ కోర్టుల్లో ఆహారం తింటూ, అక్కడి సిబ్బందితో కాలక్షేపం చేస్తున్నాడు. అక్కడే కుర్చీలు, నేలపై నిద్రిస్తున్నాడు. అయితే, టెర్మినల్‌ లోపల ఉన్న అతని కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం టర్కీకి వెళ్లిన ప్రత్యేక విమానంలో పంపించేందుకు ప్రయత్నించినప్పటకీ అక్కడి అధికారులు నిరాకరించారు. ఆ విమానంలో కేవలం టర్కీ దేశీయులకు మాత్రమే అనుమతినిచ్చారు. అయితే, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే అతన్ని పంపించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని