
మేడ్చల్‌లో ఘోరం: ఐదేళ్ల చిన్నారి దారుణహత్య
మేడ్చల్: మేడ్చల్ జిల్లా పోచారంలో ఘోరం చోటుచేసుకుంది. తల్లి ఫేస్‌బుక్ స్నేహితుడే ఆ చిన్నారి పట్ల కాలయముడై ప్రాణం తీశాడు. గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 12.30గంటల సమయంలో చిన్నారి ఆద్యతో పాటు ఆమె తల్లి సన్నిహితంగా ఉంటున్న రాజశేఖర్ అనే యువకుడిపై కరుణాకర్ అనే మరో వ్యక్తి కత్తితో దాడిచేశాడు. దాడి అనంతరం తానూ కత్తితో గొంతుకోసుకున్నాడు. దీంతో అతడిని ఉప్పల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
కరుణాకర్‌ను చూసి రాజశేఖర్‌ను గదిలో దాచింది..
సికింద్రాబాద్‌లోని భవానీనగర్‌కు చెందిన కరుణాకర్‌తో అనూషకు మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా రాజశేఖర్ అనే మరో యువకుడితో అనూష దగ్గరగా ఉండటం గమనించిన కరుణాకర్ ఆగ్రహానికి లోనయ్యాడు.ఈ క్రమంలోనే ఈ మధ్యాహ్నం 12.30గంటల సమయంలో అనూష ఇంటికి వచ్చాడు. అప్పటికే అనూష ఇంట్లో రాజశేఖర్ ఉండటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కరుణాకర్ రాకను గమనించిన అనూష.. రాజశేఖర్‌ను బాత్‌రూంలో దాచింది. గదిలో నుంచి బయటకు రావాలని అతడు ఒత్తిడిచేశాడు. బయటకు రాకపోతే చిన్నారి ఆద్యను చంపుతానని బెదిరించాడు. అయినా అతడు బయటకు రాకపోవడంతో అన్యాయంగా ఆ చిన్నారి గొంతు కోసి చంపాడు. ఆద్య అరుపులతో రాజశేఖర్ బయటకు వచ్చాడు. దీంతో అతడిపై కత్తితో దాడిచేయగా.. పరుగులు తీశాడు. చిన్నారి తండ్రి కల్యాణ్‌కు ఘట్‌కేసర్ పోలీసులు సమాచారం ఇచ్చారు.