Updated : 29/05/2021 08:35 IST

లైంగిక.. రాక్షసదాడి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : బెంగళూరులో ఇటీవల అత్యాచారానికి గురైన బంగ్లా యువతి (22) కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. నిందితులు ఆ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. అడ్డంగా దొరికిపోవడం ఓ ఎత్తైతే.. తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తొలి వీడియో వైరల్‌ అవుతుండగానే మరో వీడియో పోస్టు చేశారు. అసోం, బంగ్లాదేశ్‌లలో ఆ యువతి, యువకులతో పరిచయం ఉన్న వారి ఫిర్యాదులతో పోలీసులు కార్యాచరణ నిర్వహించి నలుగురు యువకులు, ఇద్దరు యువతులను గురువారం రాత్రి అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన హకీల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్‌, మహ్మద్‌ బాబా కేశ్‌, రియాద్‌ బాబు, నస్రత్‌, కాజల్‌ను పోలీసులు నిందితులుగా గుర్తించాక కేసు కొత్త మలుపు తిరిగింది. యువతులిద్దరూ రియాద్‌ బాబు భార్యలు. చెన్నసంద్ర సమీపంలోని కనకనగరకు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు మహజరుకు తీసుకు వెళ్లినప్పుడు రియాద్‌ బాబు, సాగర్‌ పారిపోయే క్రమంలో పోలీసు తూటాలకు గురై.. మళ్లీ కటకటాల వెనక్కి వెళ్లక తప్పిందికాదు. రామమూర్తి నగర పోలీసులు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిందితులపై మానవ అక్రమ రవాణా, అత్యాచారం, సతాయింపులు, నిర్భయ.. తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ఉన్న ఇంట్లో ఫోరెన్సిక్‌ నిపుణులు చాపలు, దిండ్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షలకు పంపారు.

● రెండేళ్ల కిందట పొట్ట చేతపట్టుకుని బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఆ యువతి (22) స్థానికంగా ఓ బార్‌లో డ్యాన్సర్‌గా ఉపాధి పొందేది. అంతకు పూర్వమే ఆమె దుబాయ్‌లో బార్‌లో ఇలాంటి పనే చేసేదని గుర్తించారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఆమె హైదరాబాద్‌లో ఒక మసాజ్‌ పార్లర్‌లో పని చేసింది. తనకు పరిచయం ఉన్న నలుగురు యువకులు, ఇద్దరు యువతులను బంగ్లాదేశ్‌ నుంచి అసోం మార్గంలో భారత్‌లోకి తీసుకు వచ్చి బెంగళూరులో కుదురుకునేలా చేసింది. ఇక్కడి సుబ్రహ్మణ్యనగరలో బాడుగ ఇంటిని తీసుకుని బంగ్లాదేశ్‌కు చెందిన నిందితులకు అదే చిరునామాతో ఆధార్‌ కార్డులనూ సమకూర్చింది. విషాదమేమంటే.. ఆమె రప్పించిన వ్యక్తులే ఆమెను బలవంతంగా పడుపువృత్తి చేయించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే యువతులతోనూ నిందితులు ఇదే పని చేయించేవారట. ఆమె చివరికి పడుపు వృత్తి మానేసి సొంతంగా స్పా పెట్టుకుంటానని చెప్పడంతో నగదు లావాదేవీల విషయంలో గొడవ మొదలైది. నస్రత్‌, కాజల్‌ ఇద్దరూ ఒత్తిడి పెంచారు. స్పా ఏర్పాటు వద్దంటూ ఇతర నిందితులు ఆమెను మంచానికి కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శరీర సున్నిత భాగాలపై మద్యం సీసాలతో దాడి చేశారు. ఆ వీడియోలను నిందితులు మే 19న సామాజిక మాధ్యమాల్లో తమకు తెలిసిన వారితో పంచుకోగా.. అవి వైరల్‌ అయ్యాయి. వాటిని చూసిన కొందరు ఇచ్చిన ఫిర్యాదులతో ఘటన వెలుగులోకి వచ్చింది.

● దాడుల తరువాత బాధిత యువతి వారి చెర నుంచి తప్పించుకుని కేరళలోని కోజికోడ్‌కు వెళ్లి తనకు పరిచయం ఉన్న మహిళ వద్ద తలదాచుకుంది. అక్కడే స్పాను ప్రారంభించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను బెంగళూరుకు తీసుకు వచ్చేందుకు ఒక బృందం ఇప్పటికే కేరళకు బయలుదేరి వెళ్లింది. లైంగిక దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న మారతహళ్లి సమీపంలో బంగ్లా ప్రజలు కొందరు నిందితులపై దాడి చేసి తీవ్రంగా కొట్టి విడిచి పెట్టారు. వీడియో వైరల్‌ అయిన వారం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసిన పోలీసు బృందాన్ని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు, ముఖ్యమంత్రి యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ బొమ్మై అభినందించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని