Crime News: చందానగర్‌ లాడ్జిలో నర్సు అనుమానాస్పద మృతి 

అనుమానాస్పద స్థితిలో ఓ నర్సు మృతి చెందిన ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

Updated : 26 Oct 2021 12:01 IST

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ నర్సు మృతి చెందిన ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె గొర్రెముంచు నాగ చైతన్య (24). నల్లగండ్ల సిటిజన్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తోంది. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి. మెడికల్‌ రిప్రజంటెటీవ్‌గా పని చేస్తున్నాడు. తరచూ వైద్యశాలకు వెళ్లే క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. సవతి తల్లి మాత్రం ఉంది. సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అప్పటి నుంచి నాగచైతన్య ఉద్యోగం వదిలి హైదరాబాద్‌ నల్లగండ్ల వైద్యశాలలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 23న ఆసుపత్రి ఎదురు ప్రాంతంలో ఓయోలో గది తీసుకున్నారు. ఇరువురు కలిసి ఉన్నారు. మరుసటి రోజు ఆదివారం రాత్రి ప్రాంతం వీరు తీసుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఓయో సిబ్బంది పరిశీలించడంతో గొంతుకోసి రక్తపు మడుగులో నాగచైతన్య మృతి చెంది ఉంది.  

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రేమికుడు కోటి రెడ్డి పొట్టలో, గొంతు దగ్గర కత్తి గాట్లతో ఒంగోలు వెళ్లి ఆసుపత్రిలో చేరినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆమె గొంతు కోసుకుందని, భయంతో నేను వచ్చేశానని చెబుతున్నట్లు తెలిసింది. ఓయో గదిని పరిశీలించగా గదిలో మద్యం సీసాలతోపాటు రక్తం మడుగును కడగడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కోటిరెడ్డి కుటుంబసభ్యుల నుంచి మరిన్ని వివరాలు తీసుకున్నాక వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని