
Crime News: భార్యకు నిప్పంటించిన భర్త.. కడుపులోని శిశువు మృతి
మహారాష్ట్ర: రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తనకు అడ్డుగా ఉందని గర్భిణీ అయిన మొదటి భార్యను హతమార్చేందుకు యత్నించాడు. ఆమెకు నిప్పంటించగా.. కడుపులోని బిడ్డ మృతిచెందింది. బాధిత మహిళ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మానవత్వానికే మచ్చలాంటి ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఠాణేలోని కల్వా మఫత్లాల్ కాలనీకి చెందిన అనిల్ బహదూర్ చౌరాసియా అనే 35 ఏళ్ల వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణీ. అయితే.. మరో పెళ్లి చేసుకున్న నిందితుడు.. భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అక్టోబరు 30న గర్భిణీ అనే కనికరం లేకుండా.. తన భార్యకు నిప్పంటించాడు. దీనిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ అప్పటికే తీవ్ర గాయాలపాలైంది. తన కడుపులో పెరుగుతున్న శిశువును సైతం కోల్పోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.