Crime News: ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం!

అమీన్‌పూర్‌ పట్టణంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు అత్మహత్యకు కారణాలు అంతు చిక్కడం లేదు. గురువారం మృతదేహాలను పోలీసులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి

Updated : 22 Jan 2022 07:01 IST

వివరాల సేకరణలో తలమునకలైన పోలీసులు

కుటుంబం బలవన్మరణం.. వీడని మిస్టరీ

శ్రీకాంత్‌గౌడ్‌, అనామిక, శ్రీస్నిగ్ధ  

అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే: అమీన్‌పూర్‌ పట్టణంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు అత్మహత్యకు కారణాలు అంతు చిక్కడం లేదు. గురువారం మృతదేహాలను పోలీసులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు మృతదేహాలను శామీర్‌పేట మండలం తూంకుంట పట్టణం పోతాయ్‌పల్లికి తీసుకువెళ్లారు. శుక్రవారం 11గంటలకు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి మృతదేహాలను తరలించే సమయంలో పోలీసులు మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని క్లూస్‌టీంకు అప్పగించారు. ఆ రెండు ఫోన్‌లు పూర్తిగా ఫార్మాట్‌ చేసి ఉన్నాయి. ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా.. అధ్యాత్మికపరంగా ఏమైనా విశ్వాసాలున్నాయా.. ఆర్థిక పరమైన ఇబ్బందుల కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

పథకం ప్రకారమే.. 

శ్రీకాంత్‌గౌడ్‌ కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగానే పథకం వేసుకున్నాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వాళ్ల ఇంటి పనిమనిషికి మంగళవారం సాయంత్రం శ్రీకాంత్‌ ఫోన్‌ చేసి.. మేము ఊరికి వెళ్తున్నాం, రెండు రోజుల తరువాత వస్తాం, మళ్లీ ఫోన్‌ చేసే వరకు రావద్దని చెప్పాడు. పాలు పోసే వ్యక్తికి కూడా అదే రోజు ఫోన్‌ చేసి చెప్పాడు.

సోషల్‌ మీడియా అకౌంట్ల తొలగింపు 

శ్రీకాంత్‌గౌడ్‌ ఆత్మహత్యకు ముందే అతని ఫోన్‌, భార్య అనామిక ఫోన్లను పూర్తిగా ఫార్మాట్‌ చేశాడు. అతని ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారం కూడా పూర్తిగా తొలగించాడు. ఇంటర్‌నెట్‌లో గూగుల్‌ సెర్చ్‌లో ఉండే హిస్టరీని కూడా తొలగించాడు. ఫోన్‌లో ఉండే సిమ్‌కార్డును కూడా తొలగించి కనిపించకుండా చేశాడు. ఫోన్లలో డేటా లేకపోవడంతో విచారణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. నిపుణుల సహకారంతో డేటాను సేకరించే పనిలో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఫొటోలు బోర్లా పడిఉండటం, మృతి చెందిన వారి ముఖాలపై పెద్ద తిలకం బొట్టు ఉండటంతో, పోలీసులు వీరికి ఆధ్యాత్మికంగా ఏమైనా నమ్మకాలున్నాయా.. అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. కొందరు.. కుటుంబీకులు ఎవరైనా మరణిస్తే ఇంట్లో దేవుడి చిత్ర పటాలను తిరగేసి ఉంచుతారని తెలుసుకున్నారు.

రుణ భారంతోనే.. 

శ్రీకాంత్‌ గౌడ్‌ కుటుంబం సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక పరమైన అంశాలే కావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంటి కొనుగోలుకు బజాజ్‌ ఫైనాన్స్‌లో రూ.30లక్షల హౌసింగ్‌ రుణం తీసుకున్నాడు. ఇంటిపై అంతస్తు నిర్మాణం సమయంలో రూ.11లక్షల టాప్‌అప్‌ రుణం తీసుకున్నాడు. మరో రూ.7లక్షల వ్యక్తిగత రుణం కూడా తీసుకున్నట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని