మూడేళ్ల చిన్నారి అదృశ్యం

స్థానిక పోలీసుస్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురం బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో మంగళవారం మూడేళ్ల చిన్నారి అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... విస్సన్నపేట ప్రాంతానికి చెందిన కనకదుర్గ, చెన్నారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

Updated : 10 Aug 2022 06:31 IST

ప్రిన్స్‌ జాయ్‌ (పాత చిత్రం)

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : స్థానిక పోలీసుస్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురం బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో మంగళవారం మూడేళ్ల చిన్నారి అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... విస్సన్నపేట ప్రాంతానికి చెందిన కనకదుర్గ, చెన్నారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కనకదుర్గ విస్సన్నపేటలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, చెన్నారావు ప్రైవేటు ఉద్యోగి. వీరి పెద్ద కుమార్తె ప్రిన్స్‌ జాయ్‌(3) తన అమ్మమ్మ భూలక్ష్మితో కలిసి బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో పెళ్లి వేడుక నిమిత్తం బంధువుల ఇంటికి వచ్చింది. ముద్దుముద్దు మాటలతో అందర్నీ నవ్వించింది. చిట్టిపొట్టి అడుగులతో వేడుక వద్ద తిరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కనిపించలేదు. బంధువులు సమీప ప్రాంతాల్లో వెతికారు. వేడుక జరిగే ఇల్లు బుడమేరు కాల్వకు ఆనుకుని ఉండటంతో.. ఒక వేళ ప్రమాదవశాత్తూ చిన్నారి కాలువ అంచున పడిపోయి ఉంటుందనే అనుమానంతో కాల్వలోనూ గాలించారు. కానీ ఆచూకీ లభ్యంకాలేదు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ లక్ష్మీనారాయణ వచ్చి, బాలిక కోసం వెతుకులాట ప్రారంభించారు. నార్త్‌ మండల ఇన్‌ఛార్జి ఏసీపీ రమణమూర్తి, సీటీఎఫ్‌ ఏడీసీపీ కొల్లి శ్రీనివాసరావులు వివరాలు సేకరించి.. గాలింపు చర్యలను పర్యవేక్షించారు. చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారా? అన్న కోణంలోనూ విచారణ చేపట్టి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో వెతికించారు. రాత్రి 9 గంటల సమయానికి కూడా ఆచూకీ లభ్యం కాక పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని