పేద రైతు కుటుంబంలో ఆరుగురి బలవన్మరణం

మట్టిని నమ్ముకున్న ఆ బడుగు రైతు చివరికి ఆశల ఊపిరి వదిలేశారు. ఉన్నదే రెండెకరాల భూమి. సంప్రదాయ సాగు నష్టాల మూట నెత్తికెత్తుతుంటే.. ఉద్యాన పంటల వైపు అడుగేశారు. లాభాలు రాకపోతాయా అనే ఆశతో.. పెట్టుబడి కోసం తలకు మించి అప్పులు చేశారు....

Updated : 29 Jun 2021 06:45 IST

ఆర్థిక ఇబ్బందులే కారణం

యాదగిరి, న్యూస్‌టుడే: మట్టిని నమ్ముకున్న ఆ బడుగు రైతు చివరికి ఆశల ఊపిరి వదిలేశారు. ఉన్నదే రెండెకరాల భూమి. సంప్రదాయ సాగు నష్టాల మూట నెత్తికెత్తుతుంటే.. ఉద్యాన పంటల వైపు అడుగేశారు. లాభాలు రాకపోతాయా అనే ఆశతో.. పెట్టుబడి కోసం తలకు మించి అప్పులు చేశారు. చివరికి అక్కడా నిరాశే ఎదురైంది. సాగు అచ్చిరాక.. అప్పుల భారం మోయలేక.. కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన... కర్ణాటకలోని యాదగిరి జిల్లా శహపుర తాలూకాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... దోరనహళ్లి గ్రామానికి చెందిన భీమరాయ సురపుర (45), శాంతమ్మ (36) భార్యాభర్తలు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సుమిత్ర (12), శ్రీదేవి (6), శివరాజ్‌ (వయసు తెలియలేదు), లక్ష్మి (4)అనే నలుగురు పిల్లలున్నారు. వీరందరూ ఆదివారం రాత్రి నుంచి కనిపించకపోయే సరికి చుట్టుపక్కల వారు వెతుకులాడారు. సోమవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని నీటి కుంట దగ్గర కొన్ని దుస్తులు కనిపించడంతో అనుమానం వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని కుంటలో గాలించి నలుగురి మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అప్పుల బాధలు ఎక్కువ కావడం వల్లే వీరు బలవన్మరణాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. శహపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని