
Software Engineer: అమెరికాలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
మృతుడు ఐఏఎస్ అధికారి రాజమౌళి మేనల్లుడు
ఈనాడు, అమరావతి: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్‌ఖన్నా (28) మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన రోహిత్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోహిత్‌ఖన్నాతో పాటు కారులో ఉన్న ఇద్దరు గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎ.వి.రాజమౌళికి రోహిత్‌ఖన్నా మేనల్లుడు. చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీటెక్ చదివి, తర్వాత అమెరికాలో ఎం.ఎస్. చేసి, డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 7న భారతదేశానికి ఆయన రావాల్సి ఉంది. ఈలోపే రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. మృతుడి తల్లిదండ్రులు రాజ్‌బంధు ఖన్నా, ఉదయలక్ష్మి.