మిరప, పత్తి రైతుల బలవన్మరణం

ఇటీవలి వర్షాలకు పంటలు దెబ్బతిని ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం బేరువాడలో మిరపసాగుతో నష్టపోయిన భాస్కర్‌ (38), నల్గొండ జిల్లా నాంపల్లి

Published : 19 Jan 2022 04:25 IST

పంటలు దెబ్బతినడంతో ముగ్గురి ఆత్మహత్య

కేసముద్రం, నాంపల్లి, మహాముత్తారం, న్యూస్‌టుడే: ఇటీవలి వర్షాలకు పంటలు దెబ్బతిని ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం బేరువాడలో మిరపసాగుతో నష్టపోయిన భాస్కర్‌ (38), నల్గొండ జిల్లా నాంపల్లి మండలం బోయగూడెంలో పత్తి రైతు లింగయ్య (51) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లికి చెందిన సుగులం అనంతరామ్‌ (48)లు ఆత్మహత్య చేసుకున్నారు.  

* భాస్కర్‌ తనకున్న ఎకరం భూమితోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశారు. ఇప్పటికే రూ.2.లక్షల అప్పు ఉండగా మరో రూ.1.50 లక్షలు రుణం తెచ్చి పెట్టుబడి పెట్టారు. తామర పురుగు కట్టడికి మళ్లీ అప్పు చేసి పురుగుల మందులు కొన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయారు. రుణం తీర్చలేనని మనోవేదన చెంది ఈ నెల 14న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా సోమవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

* మండలి లింగయ్య తనకున్న 3.18 ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ ఏడాది పత్తి పంట సాగు చేశారు. అకాల వర్షాల కారణంగా పెట్టుబడి కూడా రాకపోవడంతో మనస్తాపం చెందారు. మంగళవారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.మృతుడికి, భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  

* అనంతరామ్‌ రెండు ఎకరాల్లో మిరప, నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. ఇటీవలి వడగండ్ల వర్షాలకు అవి దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపం చెందారు. సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడి భార్య సావిత్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని