TS News: ఆస్తి కోసం అంత్యక్రియల్లో తనయుల పోటాపోటీ

ఆస్తి కోసం తల్లి మృతదేహం వద్దే ఇద్దరు కుమారులు తగవులాడుకుని.. పోటాపోటీగా తలకొరివి పెట్టిన వైనమిది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మల్లారం యశోద, భూమిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు,

Updated : 20 Jan 2022 06:45 IST

తల్లి శవం వద్ద తగవులాట
ఇద్దరూ తలకొరివి పెట్టిన వైనం

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఆస్తి కోసం తల్లి మృతదేహం వద్దే ఇద్దరు కుమారులు తగవులాడుకుని.. పోటాపోటీగా తలకొరివి పెట్టిన వైనమిది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మల్లారం యశోద, భూమిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలయ్యాయి. భూమిరెడ్డి తనకున్న ఎకరంన్నర పొలంలో పెద్ద కుమారుడు రామకిష్టారెడ్డి, చిన్న కుమారుడు రవీందర్‌రెడ్డిలకు చెరో 20 గుంటల చొప్పున గతంలోనే పంపకాలు చేశారు. మిగిలిన భూమిని తమ వద్దనే ఉంచుకున్నారు. మూడు కుటుంబాలు వేరుగా ఉంటున్నాయి. తండ్రీకొడుకులకు తరచూ గొడవలు జరిగేవి. గత ఏడాది కుల సంఘం పెద్దలు పంచాయితీ చేసి, తల్లితండ్రులను కడదాకా చూసేవారికే వారి వద్ద ఉన్న ఆస్తి వస్తుందని తేల్చి చెప్పారు. దీంతో కుమారులిద్దరూ నెలకు ఒకరు చొప్పున తల్లిదండ్రులను సాకుతూ వచ్చారు. భూమిరెడ్డి, అతని భార్య యశోద దాదాపు అయిదు నెలలుగా పెద్ద కుమారుడు రామకిష్టారెడ్డి వద్ద ఉంటున్నారు. యశోద (92) అనారోగ్యంతో బుధవారం కన్నుమూసింది. ఆస్తి కోసం అన్నదమ్ములిద్దరూ తల్లి శవం వద్దే తగవులాడుకున్నారు. చితి చుట్టూ కుండతో తిరిగే విషయంలో వారిద్దరికీ తోపులాట కూడా చోటుచేసుకుంది. చివరకు ఇద్దరూ పోటీపడి తలకొరివి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని