మైనర్ల నిర్వాకం.. నలుగురి దుర్మరణం

ఇద్దరు మైనర్ల అత్యుత్సాహం నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. వారు నిర్లక్ష్యంగా నడపడంతో అదుపుతప్పిన ఆటో కాలువలోకి దూసుకెళ్లగా ముగ్గురు అక్కడికక్కడే, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాదకర ఘటన నిర్మల్‌ జిల్లా కడెం

Published : 20 Jan 2022 06:41 IST

నిర్లక్ష్య డ్రైవింగే ప్రమాదానికి కారణం
నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో ఘటన

కడెం, న్యూస్‌టుడే: ఇద్దరు మైనర్ల అత్యుత్సాహం నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. వారు నిర్లక్ష్యంగా నడపడంతో అదుపుతప్పిన ఆటో కాలువలోకి దూసుకెళ్లగా ముగ్గురు అక్కడికక్కడే, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాదకర ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సయ్యద్‌ ముఖీద్‌ ఆటోను ఆయన సమీప బంధువులైన 15, 16 ఏళ్ల బాలురు ఇద్దరు అప్పుడప్పుడు నడుపుతుంటారు. ఈ క్రమంలోనే బుధవారం వారిద్దరూ మరో నలుగురు ప్రయాణికులతో కడెం నుంచి బెల్లాల్‌ వైపు వెళ్తున్నారు. పెద్దబెల్లాల్‌, చిన్నబెల్లాల్‌ మధ్యలో ఉన్న చెరువు కట్ట దాటగానే వారు ఒకరినుంచి ఒకరు స్టీరింగ్‌ మార్చుకుంటుండగా వాహనం అదుపుతప్పి చిన్న పంట కాలువలోకి పల్టీకొట్టింది. ప్రమాదంలో కడెం మండలంలోని కన్నాపూర్‌ పంచాయతీ చిన్నక్యాంపునకు చెందిన కోండ్ర శంకరమ్మ(53), పెద్దబెల్లాల్‌కు చెందిన చీమల శాంత(50), లింగాపూర్‌ పంచాయతీ మల్లన్నపేటకు చెందిన బోడ చిన్నరాజమల్లు(63) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో నడుపుతున్న ఇద్దరు మైనర్లు సహా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని నిర్మల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దస్తురాబాద్‌ మండలం గొడిసిర్యాలకు చెందిన శ్రీరాముల లక్ష్మి(65) మరణించారు. ఖానాపూర్‌ సీఐ అజయ్‌బాబు, కడెం ఎస్సై కోసన రాజులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మైనర్లకు ఆటో ఇచ్చిన యజమాని ముఖీద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని