2 జిల్లాల్లో హత్యాకాండ

తనతో సహజీవనం చేస్తున్న మహిళ.. వేరే వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో హత్యాకాండకు తెగబడ్డాడో వ్యక్తి. నెల్లూరు జిల్లాలో ఇద్దరిని చంపి.. ఆపై ప్రకాశం జిల్లా ఒంగోలుకు వెళ్లి, అక్కడ కత్తితో మరో వ్యక్తిపై దాడి చేశాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Published : 23 Jan 2022 05:11 IST

ఇద్దరి మృతి,  ప్రాణాపాయ స్థితిలో మరొకరు

వివాహేతర సంబంధమే కారణం

కలిగిరి (నెల్లూరు), ఒంగోలు నేరవార్తలు, న్యూస్‌టుడే: తనతో సహజీవనం చేస్తున్న మహిళ.. వేరే వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో హత్యాకాండకు తెగబడ్డాడో వ్యక్తి. నెల్లూరు జిల్లాలో ఇద్దరిని చంపి.. ఆపై ప్రకాశం జిల్లా ఒంగోలుకు వెళ్లి, అక్కడ కత్తితో మరో వ్యక్తిపై దాడి చేశాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి.. తన సమీప బంధువైన రబ్బానీతో పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. వారిద్దరూ కలిసి ఒంగోలులో టీ దుకాణం నడుపుతున్నారు. ఈ దుకాణంలో పనిచేసే కాశీరావు అనే వ్యక్తితో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడి, అతడితో వెళ్లిపోయింది. దీనంతటికీ కారణం ఆ మహిళ వదిన మీరాంబీ (47) అని భావించిన రబ్బానీ.. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పోలంపాడుకు మకాం మార్చాడు. శనివారం ఉదయం 9 గంటలకు మీరాంబీ ఇంటికి వెళ్లి, కత్తితో ఆమె మెడపై నరికాడు. ఆమె రక్తపుమడుగులో కొట్టుకుని ప్రాణాలొదిలారు. అడ్డొచ్చిన ఆమె కుమారుడు అలీఫ్‌ (23) ఛాతీపై కత్తితో పొడవడంతో అతడూ మరణించాడు. ఈ సమయంలో మీరాంబీ భర్త ఇంట్లో లేరు.

మాటువేసి... కాశీరావుపై దాడి

నిందితుడు రబ్బానీ అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఒంగోలు వెళ్లాడు. గుంటూరు రోడ్డులో మాటు వేసి, అక్కడకు వచ్చిన కాశీరావుపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ రబ్బానీని పట్టుకున్నారు. క్షతగాత్రుడిని రిమ్స్‌కి తరలించగా ప్రథమచికిత్స అనంతరం.. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని