రాణెమ్మ వెంటే... వెంకటలక్ష్మమ్మ

వారిది నిరుపేద కుటుంబం... ప్రేమానురాగాలకు మాత్రం కొదువ లేదు. కష్టసుఖాలన్నీ సమానంగా పంచుకుంటారు. రోజుకూలీకైనా కలిసే వెళ్లేవారు. అలాంటి ఇంట్లో పెనువిషాదం నెలకొంది. పాము రూపంలో మనుమరాలిని విధి కాటేయగా...

Updated : 26 Jan 2022 05:40 IST

పాము కాటుకు మనవరాలు బలి
తట్టుకోలేక గుండెపగిలిన నాయనమ్మ

గడివేముల, న్యూస్‌టుడే: వారిది నిరుపేద కుటుంబం... ప్రేమానురాగాలకు మాత్రం కొదువ లేదు. కష్టసుఖాలన్నీ సమానంగా పంచుకుంటారు. రోజుకూలీకైనా కలిసే వెళ్లేవారు. అలాంటి ఇంట్లో పెనువిషాదం నెలకొంది. పాము రూపంలో మనుమరాలిని విధి కాటేయగా... ఆమెతో పెనవేసుకున్న పాశం నాయనమ్మను బలితీసుకుంది. కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరుకు చెందిన కాటెపోగు వెంకటసుబ్బయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. అంతా కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు పెద్ద కుమార్తెలకు వివాహాలు చేశారు. పొలంలో పని చేస్తుండగా పదిహేను రోజుల క్రితం వెంకటసుబ్బయ్య చిన్నకుమార్తె రాణెమ్మ(18)ను పాము కాటేసింది. వెంటనే చికిత్స అందించగా కోలుకుంది. ఈనెల 17న తల్లితో కలిసి పొలాల్లో కూలీ పనులు చేస్తుండగా మరోసారి పాము కరిచింది. పరిస్థితి విషమంగా మారడంతో నంద్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో, ఆ తర్వాత శాంతిరాం ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అప్పులు తెచ్చి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే రాణెమ్మ సోమవారం సాయంత్రం చనిపోగా మృతదేహాన్ని, అదేరోజు రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు. నాయనమ్మ వెంకటలక్ష్మమ్మ(72) తన మనుమరాలి మృతదేహాం వద్ద విలపిస్తూ.... కుప్పకూలి ప్రాణాలు వదిలారు. నాలుగు గంటల వ్యవధిలోనే నాయనమ్మ, మనుమరాలు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. మంగళవారం వారిద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని