వివేకా హత్య వెనుక భారీ కుట్రకోణం

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్ర కోణం ఉందని, దాన్ని తేల్చే కీలక దిశగా దర్యాప్తు సాగుతోందని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. నిందితులకు బెయిలు

Published : 13 May 2022 05:26 IST

ఇప్పుడు నిందితులకు బెయిలిస్తే సాక్షులకు ముప్పన్న సీబీఐ

కుట్రదారులు తేలేవరకూ బెయిలివ్వొద్దన్న వివేకా కుమార్తె

కేసు దర్యాప్తు ఎన్నాళ్లు పడుతుందని ప్రశ్నించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్ర కోణం ఉందని, దాన్ని తేల్చే కీలక దిశగా దర్యాప్తు సాగుతోందని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షులకు తీవ్ర ముప్పుందని తెలిపారు. నిందితులకు బెయిలివ్వొద్దని సీబీఐతోపాటు వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది విన్నవించారు. వివేకా హత్య కేసులో నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5), వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) బెయిలు కోసం వేసిన వ్యాజ్యాలపై హైకోర్టు వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి గురువారం విచారణ జరిపారు. హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని సీబీఐని కోరారు. దర్యాప్తు కొనసాగింపు కారణంగా నిందితులను ఎక్కువ కాలం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచలేమన్నారు. దిగువ కోర్టులో రెండో అభియోగపత్రం (ఛార్జిషీట్‌) వేశాక జరిగిన దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేశారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.
తొలుత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్‌ను 2021 నవంబరు 17న అరెస్టు చేశారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి (ఏ4) చెప్పిన వాంగ్మూలం తప్ప పిటిషనర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవు. అభియోగపత్రం దాఖలు చేశాక సీబీఐ దర్యాప్తులో పురోగతి లేదు. ఎలాంటి షరతులు విధించినా పర్లేదు.. బెయిలు మంజూరు చేయండి’ అని కోరారు. దర్యాప్తు పూర్తి చేసి దిగువ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారని, బెయిలు మంజూరు చేయాలని మరో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి తరఫున న్యాయవాది కె.చిదంబరం కోరారు. ఇప్పటికే రెండు అభియోగపత్రాలు దాఖలు చేశారని, దర్యాప్తును ఎంతకాలం కొనసాగిస్తారని న్యాయమూర్తి సీబీఐని ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత ఆందోళనతోపాటు నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను తాము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందని చెప్పారు. సీబీఐ న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. హత్య వెనుక భారీ కుట్ర కోణం ఉందన్నారు. పిటిషనర్‌ సాక్షులను బెదిరిస్తున్నారని, బెయిలిస్తే వారికి తీవ్ర ముప్పు ఉందని చెప్పారు. సీబీఐ అధికారుల డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించారని, హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. శివశంకర్‌రెడ్డిపై హత్య, హత్యాయత్నం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం తదితర సెక్షన్ల కింద మొత్తం 31 కేసులున్నాయన్నారు. పిటిషనర్లకు బెయిలు ఇవ్వద్దని కోరారు.

శివశంకర్‌రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారు
వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. సీబీఐ రెండో ఛార్జిషీట్‌ వేశాక దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందని తేటతెల్లమైందన్నారు. శివశంకర్‌రెడ్డి జైల్లో ఉంటూనే సాక్షులను బెదిరిస్తున్నారని, సీబీఐని దర్యాప్తు చేయనీయడం లేదని చెప్పారు. గతంలో సీబీఐ ముందు సాక్ష్యం ఇవ్వడానికి అంగీకరించినవారు.. ఆయన వల్ల ఇప్పుడు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు. పోలీసులు  సీబీఐకి సహకరించడం లేదని, దర్యాప్తు పూర్తయి, హత్య వెనుక కుట్రదారులెవరో తేలేవరకు పిటిషనర్లకు బెయిలు ఇవ్వొద్దని, ఆ పిటిషన్లను కొట్టేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు