రాయితో మోది, కత్తులతో పొడిచి.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య

హైదరాబాద్‌ నడిబొడ్డున మరో పరువు హత్య జరిగింది. ప్రేమవివాహం చేసుకున్నందుకు ఇటీవల సరూర్‌నగర్‌లో నాగరాజును అమ్మాయి కుటుంబసభ్యులు కిరాతకంగా హత్య చేయగా.. తాజాగా మరో ఘటన

Updated : 21 May 2022 07:14 IST

యువకుడిని దారుణంగా చంపిన దుండగులు
ప్రేమ వివాహం చేసుకున్నందుకే ఘాతుకం
బావమరిదే చంపించాడని పోలీసుల అనుమానం

ఈనాడు, హైదరాబాద్‌-గోషామహల్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నడిబొడ్డున మరో పరువు హత్య జరిగింది. ప్రేమవివాహం చేసుకున్నందుకు ఇటీవల సరూర్‌నగర్‌లో నాగరాజును అమ్మాయి కుటుంబసభ్యులు కిరాతకంగా హత్య చేయగా.. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బేగంబజార్‌ చేపలమార్కెట్‌ సమీపంలో ఒక యువ వ్యాపారి శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే ఈయన్ను అంతమొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏసీపీ సతీశ్‌కుమార్‌, సీఐ అజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. బేగంబజార్‌ కోల్సావాడికి చెందిన నీరజ్‌కుమార్‌ పన్వర్‌(22) పల్లీల వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన సంజన(20)ను ఏడాదిన్నర కిందట ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. ఈ క్రమంలో సంజన కుటుంబీకులు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. నీరజ్‌ను సంజన సోదరుడు ఆరునెలలుగా చంపాలని చూస్తున్నాడు. వారం రోజుల నుంచి నీరజ్‌ నిర్వహిస్తున్న దుకాణం వద్ద నుంచి ఇంటికి వెళ్లే వరకు సమయాన్ని సంజన సోదరుడు పరిశీలించాడు. శుక్రవారం వాతావరణం మేఘావృతమై ఉండటంతో పాటు.. జనసంచారం తక్కువగా ఉండటంతో హత్యకు ఇదే అదనుగా భావించి.. స్నేహితులకు సమాచారం అందించాడు. వారంతా అక్కడికి చేరుకుని నీరజ్‌ రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చి గ్రానైట్‌ రాయితో తలపై మోదారు. అనంతరం కొబ్బరిబొండాల కత్తితో పొడిచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడిఉన్న నీరజ్‌ను షాహీనాయత్‌ గంజ్‌ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నీరజ్‌ను చంపింది అయిదుగురని నిర్ధారించుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లయినప్పుడే రక్షణ కోరిన నీరజ్‌  

కులాంతర వివాహం చేసుకున్న నీరజ్‌, తన భార్య కుటుంబీకుల నుంచి ముప్పు తప్పదని ముందే గ్రహించి ఏడాది కిందట అఫ్జల్‌గంజ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలంటూ అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయింది. నీరజ్‌ మృతితో ఆగ్రహం చెందిన బేగంబజార్‌ వ్యాపారులు శుక్రవారం అర్ధరాత్రి భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. శనివారం బేగంబజార్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని