Crime News : కర్నూలు జిల్లా జంటహత్యల కేసు.. 12 మంది అరెస్ట్‌

కర్నూలు జిల్లా సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితులను...

Updated : 28 Jan 2022 19:33 IST

ఆదోని నేర వార్తలు: కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలోని కామవరం గ్రామంలో గురువారం జంట హత్యలు జరిగాయి. కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. గ్రామంలో ఓ భూవివాదానికి సంబంధించి వడ్డే మల్లికార్జున ఇంటికి మాట్లాడేందుకు వెళ్లిన శివప్ప, ఈరన్నతో పాటు మరికొందరిపై మల్లికార్జున కుటుంబ సభ్యులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో శివప్ప(40), ఈరన్న(50) మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. 

ఈ కేసులో పరారైన నిందితుల్లో ఏడుగురిని హైదరాబాద్‌ మెట్రో రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేయగా, మిగిలిన ఐదుగురు మహిళలను మండల పరిధిలోని మాచుమానుదొడ్డి గ్రామంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తామన్నారు. నిందితులపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేససి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 24గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

సామాజిక మాధ్యమాల వేదికగా రెండు వర్గాల మధ్య నెలకొన్న భూ వివాద ఆరోపణలపై మాట్లాడేందుకు వడ్డె మల్లికార్జున ఇంటి వద్దకు సర్పంచి సోదరుడు శివప్పతోపాటు 30 మంది వరకు వెళ్లారు. అప్పటికే ప్రణాళికతో ఉన్న మల్లికార్జున, రాజు, రామాంజి, ఈశ్వర్‌, గోపాల్‌, చంద్రతోపాటు మరికొందరు మహిళలు రాళ్లు, కారంతో ఒక్కసారిగా దాడికి దిగారు. ప్రతిఘటించబోయిన వారిపై పురుగులమందు పిచికారీ చేసే స్ప్రేయర్‌లో యాసిడ్‌ కలిపి చల్లడంతో వచ్చిన వారంతా పరుగులు పెట్టారు. ఈ క్రమంలో హరిజన శివప్ప(45), భాస్కర్‌ అలియాస్‌ గట్టు ఈరన్న (47)పై కొడవళ్లు, గొడ్డలి, ఉలి వంటి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టారు. కొనఊపిరితో ఉన్న ఈరన్నను బంధువులు ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘర్షణలో సత్యప్ప, బజారప్ప, అయ్యప్ప, పెద్దతిమోతి, ఇస్మాయిల్‌కు గాయాలవగా ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో బజారప్ప, సత్యప్పల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు.

ఇదీ ‘పంచాయితీ’

కామవరానికి చెందిన బోయ మునీంద్రయ్యకు 254 సర్వే నంబరులో ఏడెకరాల భూమి ఉంది. దాన్ని ఆనుకొని ఉన్న పోరంబోకు భూమిని సాగు చేసుకొంటున్న వడ్డె మల్లికార్జున... మునీంద్రయ్య పొలం కొంటానంటూ కొంత నగదు చెల్లించి చాలా ఏళ్ల కిందట ఒప్పందం చేసుకొన్నారు. పూర్తి సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండానే మల్లికార్జున కుటుంబం భూమిపై సాగులోకి వెళ్లింది. ఈ వివాదం కోర్టుకు చేరింది. కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు వచ్చినా పొలంలోకి రానివ్వడం లేదంటూ మునీంద్రయ్య గ్రామంలోని వైకాపా నాయకుడు మహేంద్రారెడ్డిని ఆశ్రయించారు. విషయం తెలుసుకొన్న మల్లికార్జున... భాజపా నాయకులతో  ప్రెస్‌మీట్‌ పెట్టించారు. భూ కబ్జాదారు అంటూ వైకాపా నాయకుడిపై సామాజిక మాధ్యమాల్లో వార్తల క్లిప్పింగ్‌లు పెట్టారు. ఈ నేపథ్యంలో భూ వివాదంపై వారం వ్యవధిలో ఇద్దరూ పోలీస్‌స్టేషన్‌కూ వెళ్లారు. మరోవైపు తనపై ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో తెలుసుకొని, పిలుచుకొని రావాలంటూ మహేంద్రారెడ్డి చెబితే వెళ్లామని క్షతగాత్రుల్లో కొందరు చెబుతున్నారు. ఊహించని విధంగా వారిపై దాడికి పాల్పడిన మల్లికార్జున బంధువులు.. వెంటనే ఇంటికి తాళాలేసి పరారయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని