
Triple Talaq: ట్రిపుల్ తలాక్ చెప్పలేదని చితకబాదారు!
తిరువనంతపురం: ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందని.. కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం నేరంగా పరిగణిస్తారు. కానీ, విచిత్రంగా.. కేరళలో ఓ మహిళ తల్లిదండ్రులు, బంధువులు ట్రిపుల్ తలాక్ చెప్పట్లేడని ఆమె భర్తపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వివరాళ్లోకి వెళితే..
కేరళలోని కొట్టకాల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ అసీబ్కు నాలుగు నెలల క్రితం ఫాతిమా షాహిమాతో వివాహమైంది. అది పెద్దలు కుదిర్చిన సంబంధమే. అయితే, ఇటీవల వారిద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో ఫాతిమా పుట్టింటికి వెళ్లిపోయింది. వారి గొడవలో ఆమె కుటుంబసభ్యులు జోక్యం చేసుకొని అసీబ్పై దాడి చేశారు. అతడు ఉద్యోగం చేసే చోటుకే వెళ్లి దారుణంగా కొట్టారు. తమ కుమార్తెకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వమని బెదిరించారు. అనంతరం కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లి మళ్లీ చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై అసీబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమది ప్రేమ వివాహం కాదని, విడాకులు తీసుకునేంత సమస్య ఏం వచ్చిందో తనకు తెలియదని అసీబ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన భార్య ఆమె పుట్టింట్లో ఉందని, ఆమె కుటుంబసభ్యులు ట్రిపుల్ తలాక్ చెప్పాలని కత్తితో తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసీబ్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఫాతిమా కుటుంబ సభ్యుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.