రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన మావోయిస్టులు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

మావోయిస్టు కీలక నేత ప్రశాంత్‌ బోస్‌ అలియాస్‌ కిషన్‌దా అరెస్ట్‌ను నిరసిస్తూ శనివారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఝార్ఖండ్‌లో దుశ్చర్యకు పాల్పడ్డారు.

Updated : 21 Nov 2021 04:18 IST

లతేహర్‌ (ఝార్ఖండ్‌): మావోయిస్టు కీలక నేత ప్రశాంత్‌ బోస్‌ అలియాస్‌ కిషన్‌దా అరెస్ట్‌ను నిరసిస్తూ శనివారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఝార్ఖండ్‌లో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఝార్ఖండ్‌లోని లతేహర్‌, పశ్చిమ సింగ్‌బుమ్‌ జిల్లాల పరిధిలోని రెండు వేర్వేరు చోట్ల రైల్వే ట్రాక్‌లను పేల్చివేశారు. ఇది సీపీఐ (మావోయిస్టు) పార్టీ పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బార్ఖాకానా- గర్హ్వా, హౌరా -మంబయి మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

దక్షిణ తూర్పు రైల్వే (ఎస్‌ఈఆర్‌) చక్రధర్‌పూర్‌ డివిజన్‌ సింగ్‌బుమ్‌ జిల్లా పరిధిలోని లోతాపహార్‌- సోనువా మధ్య రైల్వే ట్రాక్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. శుక్రవారం రాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రాక్‌ ధ్వంసం అవ్వడంతో హౌరా- ముంబయి మధ్య రైళ్లు నిలిచిపోయాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యామ్నాయ రైల్వే ట్రాకుల ద్వారా రైళ్ల రాకపోకలు కొనసాగాయి. రెండుగంటల తర్వాత పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు.

తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్‌) పరిధిలోని ధన్‌బాద్‌ డివిజన్‌లోనూ లతేహార్‌ జిల్లాలో రిచుగుటా-డెమూ మధ్య శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 12.30 గంటల సమయంలో మరో ట్రాక్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బార్ఖాకానా- గర్హ్వా మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఓ డీజిల్‌ ఇంజిన్‌ దెబ్బతింది. సుమారు పది గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పలు రైళ్లను దారి మళ్లించగా.. ఓ స్పెషల్‌ ట్రైన్‌ను రద్దు చేశారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని