మెదక్‌ లంచం కేసులో అనిశా కస్టడీకి నిందితులు

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లంచం కేసులో ఐదుగురు నిందితులను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా ఈనెల 24వ తేదీ వరకు న్యాయస్థానం నిందితులను కస్టడీకి ....

Published : 21 Sep 2020 16:57 IST

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లంచం కేసులో ఐదుగురు నిందితులను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా ఈనెల 24వ తేదీ వరకు న్యాయస్థానం నిందితులను కస్టడీకి అనుమతించింది. దీంతో చంచల్‌ గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీమ్‌ అహ్మద్‌, నగేశ్‌ బినామీ జీవన్‌గౌడ్‌లను బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిందితులకు పీపీఈ కిట్లు వేసి ప్రశ్నిస్తున్నారు. కేసులో ఎవరి పాత్రయినా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. 

హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తిలో 112 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి ఎన్‌వోసీ ఇవ్వాలని మూర్తి ఇటీవల అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను సంప్రదించారు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు తనకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.1.12 కోట్లు ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ డిమాండ్‌ చేశాడు. ఇప్పటికే రూ.40లక్షల నగదు తీసుకున్న ఆయన.. మరో రూ.72లక్షల కోసం ఐదు ఎకరాల భూమిని తన బినామీ జీవన్‌గౌడ్‌ పేరుమీద అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు అనిశా అధికారులను సంప్రదించి ఆధారాలు సమర్పించడంతో రంగంలోకి దిగిన అనిశా అధికారులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని