హోసూరు దోపిడీ వివరాలను వెల్లడించిన సీపీ

తమిళనాడులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో సినీ ఫక్కీలో జరిగిన దోపిడీని సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ దాటి హైదరాబాద్ మీదుగా నాగపూర్ పారిపోతున్న దోపిడీ ముఠాకు చెందిన

Published : 24 Jan 2021 01:40 IST

హైదరాబాద్‌: తమిళనాడులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో సినీ ఫక్కీలో జరిగిన దోపిడీని సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ దాటి హైదరాబాద్ మీదుగా నాగపూర్ పారిపోతున్న దోపిడీ ముఠాకు చెందిన ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దోపిడీ చేసిన సొత్తుతో పాటు నిందితులు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు.

‘‘తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో ఈనెల 22న ఉదయం ముత్తూట్ ఫైనాన్సులో భారీ దోపిడీ జరిగింది. ఆరుగురు దోపిడీ దొంగలు ముసుగు ధరించి ముత్తూట్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ముగ్గురు దొంగలు బయట ఉండగా.. మరో ముగ్గురు లోపలికి తుపాకులతో వెళ్లారు. కాపలాదారుడితో పాటు కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. లోపల లాకర్ గదిలో ఉన్న 25కిలోల బంగారు ఆభరణాలతో పాటు రూ.93వేల నగదును దోచుకెళ్లారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దొంగలు ఆభరణాలను పెద్ద బ్యాగులో వేసుకొని పరారయ్యారు. 

20కి.మీల దూరం ద్విచక్ర వాహనాలపైనే వెళ్లిన తర్వాత అక్కడ ముందే సిద్ధంగా ఉంచిన కంటైనర్‌లోకి ఆభరణాల సంచిని మార్చారు. అనంతరం కంటైనర్‌ను బెంగళూర్ వైపు పోనిచ్చారు. నిందితులు ద్విచక్ర వాహనాలపై బెంగళూర్ వరకు వచ్చి.. అక్కడ వాటిని వదిలేసి... టాటా సుమోను అద్దెకు తీసుకున్నారు. ముందు సుమోలో వెళ్తూ.. వెనకాల కంటైనర్ వచ్చే విధంగా చూసుకున్నారు. అనంతపురం వచ్చాక అక్కడ సుమో దిగి.. మరో వాహనాన్ని అద్దెకు మాట్లాడుకున్నారు. అనంతపురం నుంచి హైదరాబాద్ వరకు వదిలిపెట్టేలా ఆ వాహనాన్ని అద్దెకు తీసుకొని బయల్దేరారు. దోపిడీ ఘటన గురించి  తెలుసుకున్న కృష్ణగిరి ఎస్పీ బండి గంగాధర్ సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ద్వారా దృశ్యాలను
పరిశీలించారు. 40 బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించారు. 

నిందితులు మాట్లాడిన భాషను బట్టి ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్లుగా అనుమానించారు. వాహనాల కదలికలను బట్టి దోపిడీ ముఠా నాగపూర్ వైపు వెళ్తుండవచ్చని అనుమానించి.. ఏపీ, కర్నాటక, తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులకు తమిళనాడు డీజీపీ నేరుగా ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దోపిడీ ముఠాను పట్టుకునేందుకు మూడు కమిషనరేట్ల పరిధిల్లోని 150మందికి పైగా పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. రాయికల్ టోల్ గేట్ మొదలుకొని జాతీయ రహదారి, బాహ్యవలయ రహదారితో పాటు నగరంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో షాద్ నగర్ టోల్ గేట్ వద్ద అనుమానాస్పదంగా వాహనంలో వెళ్తున్న వ్యక్తులను అక్కడి పోలీసులు గుర్తించారు. వెంటనే తొండుపల్లి వద్ద ఉన్న పోలీసు అధికారులకు సమాచారాన్ని అందించారు. తొండుపల్లి వద్ద శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వెంటనే ఆరుగురు సభ్యుల దోపిడీ ముఠాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దాదాపు గంట పాటు దోపిడీ గురించి వివరాలు చెప్పని నిందితులు.. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నారు. అప్పటికే కంటైనర్.. శంషాబాద్ బాహ్యవలయ రహదారి మీదుగా తుక్కుగూడ, పెద్దఅంబర్ పేట్, ఘట్ కేసర్ నుంచి మేడ్చల్ చేరుకుంది. కంటైనర్ వాహనం నెంబర్‌తో సహా వివరాలన్నీ మేడ్చల్ పోలీసులకు శంషాబాద్ పోలీసులు చేరవేయడంతో.. అక్కడి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎట్టకేలకు కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నట్లు’’ సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

గతేడాది లూథియానాలో..

దోపిడీకి పాల్పడిన వాళ్లను అంతర్ రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు ముగ్గురు, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ దోపిడీ ముఠా గతేడాది అక్టోబర్‌లో పంజాబ్‌లోని లూథియానాలో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ సిబ్బంది ప్రతిఘటించడంతో దోపిడీ ముఠా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో మూత్తూట్ కార్యాలయ సిబ్బందిలో ఒకరు మృతి చెందారు. దోపిడీ ముఠా వద్ద 7 తుపాకులు ఉన్న విషయాన్ని తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. తొండుపల్లి వద్ద వాహనంలో ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకునే సమయంలోనూ.. కంటైనర్ ఆపి తనిఖీలు చేసే సందర్భంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ దోపిడీ ముఠా కాల్పులు జరిపినా.. దాన్ని ఎదుర్కొనే విధంగా సైబరాబాద్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కానీ నిందితులను చాకచక్యంగా పట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రతిఘటన చోటు చేసుకోలేదు. పోలీసులకు అనుమానం రాకుండా దోపిడీ దొంగలు వ్యవహరించారు. బెంగళూర్ నుంచి అనంతపురం వరకు ఒక వాహనం, అనంతపురం నుంచి హైదరాబాద్ కు మరో వాహనం, హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లేందుకు మరో వాహనం మాట్లాడుకున్నారు. నాగపూర్ విమానాశ్రయం వెళ్లి అక్కడ బంగారం పంచుకొని ఎవరికి వాళ్లు విడిపోయి.. వాళ్ల ప్రాంతాలకు వెళ్లేలా ప్రణాళిక రచించుకున్నారు. సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో దోపిడీ దొంగల బండారం మొత్తం బయటపడింది. 


మరోవైపు పరారీలో ఉన్న అమిత్ అనే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌పై తమిళనాడు పోలీసులు కృష్ణగిరి తీసుకెళ్లారు. దోపిడీ ముఠాను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వస్తుందని కృష్ణగిరి ఎస్పీ బండి గంగాధర్ తెలిపారు. దోపిడీ ముఠాను చాకచాక్యంగా పట్టుకోవడంలో సహకరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ సజ్జనార్‌ అభినందించారు.

 

ఇవీ చదవండి..

వెండి సింహాల చోరీ.. దొరికిన నిందితుడు

సీఎం ఇంటిని ముట్టడిస్తే అత్యాచారయత్నం కేసా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు