Medak: మంగళసూత్రాన్ని మాయం చేసిన పురోహితుడు

మెదక్ జిల్లా పడాలపల్లిలో జరిగిన ఓ వివాహవేడుకలో పురోహితుడే చేతివాటం ప్రదర్శించడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వేదమంత్రాలు ఉచ్ఛరిస్తూ వివాహ తంతు జరిపించే పురోహితుడే ఏకంగా మంగళసూత్రాన్ని మాయం చేశాడు....

Published : 19 May 2021 01:22 IST

తూప్రాన్: మెదక్ జిల్లా పడాలపల్లిలో జరిగిన ఓ వివాహవేడుకలో పురోహితుడే చేతివాటం ప్రదర్శించడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వేదమంత్రాలు ఉచ్ఛరిస్తూ వివాహ తంతు జరిపించే పురోహితుడే ఏకంగా మంగళసూత్రాన్ని మాయం చేశాడు. పెళ్లి అయిపోయాక వధువు మెడలో పుస్తెలతాడు లేదని గమనించిన కుటుంబసభ్యులు పురోహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఈనెల 16న ఓ జంటకు వివాహం జరిగింది. పడాలపల్లికి చెందిన మునిరాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేంధర్ దాసు, నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గజ్వేల్ కు చెందిన ఓ పురోహితుడు వీరి వివాహం జరిపించాడు. అయితే అమ్మాయి మెడలో వేయాల్సిన 3 తులాల బంగారు పుస్తెలతాడును పురోహితుడు జేబులో వేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. ఈ దృశ్యాలు కూడా పెళ్లి వీడియోలో రికార్డయ్యాయని పేర్కొంటున్నారు. రెండు రోజులుగా పురోహితుడికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని.. నేరుగా ఇంటికి వెళ్లి అడిగితే కుటుంబ సభ్యులు తమకు తెలియదంటున్నారని వాపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడు జేబులో పుస్తెలతాడు వేసుకుంటున్న వీడియోను పరిశీలిస్తున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని