Crime: మాస్క్‌ ధరించలేదని గొడవ.. ఆపై కాల్పులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలిలో దారుణం జరిగింది. ఖాతాదారుడిపై బ్యాంకు సెక్యూరిటీ గార్డు కాల్పులకు తెగబడ్డాడు. మాస్కుపై మొదలైన గొడవతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Published : 26 Jun 2021 06:41 IST

బరేలి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలిలో దారుణం జరిగింది. ఖాతాదారుడిపై బ్యాంకు సెక్యూరిటీ గార్డు కాల్పులకు తెగబడ్డాడు. మాస్క్‌పై మొదలైన గొడవతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. బరేలిలోని జంక్షన్‌ రోడ్డులో ఉన్న బరోడా బ్యాంకుకు రాజేశ్‌ అనే వ్యక్తి పనిమీద వెళ్లాడు. ఆయన వెంట భార్య ప్రియాంక కూడా ఉన్నారు. అయితే అతడు మాస్క్‌ ధరించడం మరచిపోయాడు. మాస్కు లేకుండా బ్యాంకులోకి ప్రవేశిస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు కేశవ్‌ అడ్డుకున్నాడు. మాస్కు ధరించాలని సూచించాడు. అనంతరం మాస్కు ధరించి లోపలికి వెళుతుండగా మరోసారి అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు.. ఇది భోజన సమయమని, లోపలికి అనుమతించనని తేల్చిచెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

కోపోద్రిక్తుడైన సెక్యూరిటీ గార్డు తన వద్ద ఉన్న తుపాకీతో రాజేశ్‌పై కాల్పులు జరిపాడు. రాజేశ్‌ రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అతడి భార్య ఏడుస్తుండగా, అక్కడే ఉన్న సెక్యూరిటీగార్డు కూడా వీడియోలో కనిపించాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని