
Crime News: అత్యాశకు పోయి.. మోసగాళ్ల వలలో చిక్కి
తక్కువ ధరకు బంగారం ఇస్తామని స్టూవర్టుపురం ముఠా దోపిడీ
రూ.31 లక్షలు పోగొట్టుకున్న షాద్‌నగర్ వ్యాపారులు
బాపట్ల, న్యూస్‌టుడే: త్వరగా రూ.లక్షలు సంపాదించాలన్న వ్యాపారుల అత్యాశ మోసగాళ్లకు వరమైంది. మాయగాళ్ల వలలో చిక్కుకొన్న వారు రూ.లక్షలు పోగొట్టుకొని తలలు బాదుకోవాల్సి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దముగట్ల అమర్నాథ్రెడ్డి, జక్కల ఆంజనేయులు బంగారం వ్యాపారం చేస్తుంటారు. ప్రకాశం జిల్లా చీరాలలో రూ.31 లక్షలకే కిలో బంగారం లభిస్తుందని మధ్యవర్తులు వారిని నమ్మించారు. సమాచారం నిర్ధారించుకుందామని వినుకొండకు చెందిన మధ్యవర్తి ద్వారా వారు ఈ నెల 11న విజయవాడకు వచ్చారు. గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన ర్యాప్ ముఠా సభ్యులు తమ వెంట కొంత బంగారం తీసుకొచ్చి వారికి చూపించారు. అసలు బంగారమేనని నిర్ధారించుకుని కిలో కొనేందుకు ఈ నెల 15న శనివారం వ్యాపారులు మరో నలుగురు మిత్రులతో కలిసి నగదుతో చీరాలకు వచ్చారు. వారిని ర్యాప్ ముఠా బాపట్ల మండలం బేతపూడి వద్దకు పిలిపించి బంగారం ఇస్తున్నట్లు నటించి రూ.31 లక్షల నగదు తీసుకుంది. అదే సమయంలో ముఠా సభ్యులు కొందరు పోలీసుల వేషంలో వచ్చి హడావుడి చేసి నగదు తీసుకొని ఉడాయించారు. కాసేపటికి మోసపోయినట్లు తెలుసుకొని లబోదిబోమంటూ వెదుళ్లపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి వ్యాపారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్టూవర్టుపురానికి చెందిన నిందితులు ఉత్తమ్‌కుమార్, ప్రసాద్, దానియేలు, శశిధర్, గురవయ్య, వెంకట్రావు, డేవిడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.