Crime News: లాభాలంటూ.. రూ.17 కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు మాజీ ఉద్యోగి

బ్యాంకులో కాకుండా తనకు డబ్బులు ఇస్తే షేర్లు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో మదుపు చేసి రూ.లక్షల్లో లాభాలు ఇస్తానంటూ ఖాతాదారులను నమ్మించాడు. వారందరినీ మోసం చేసి రూ.17 కోట్లు కొల్లగొట్టాడు. బాధితుల సొమ్మును స్వాహా చేసిన కార్పొరేట్‌ బ్యాంకు మాజీ ఉద్యోగి రావిప్రోలు...

Published : 28 Sep 2021 07:36 IST

పెట్టుబడుల పేరిట ఖాతాదారుల నుంచి వసూలు

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకులో కాకుండా తనకు డబ్బులు ఇస్తే షేర్లు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో మదుపు చేసి రూ.లక్షల్లో లాభాలు ఇస్తానంటూ ఖాతాదారులను నమ్మించాడు. వారందరినీ మోసం చేసి రూ.17 కోట్లు కొల్లగొట్టాడు. బాధితుల సొమ్మును స్వాహా చేసిన కార్పొరేట్‌ బ్యాంకు మాజీ ఉద్యోగి రావిప్రోలు శ్రీహర్షను సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. పంజాబ్‌ రాష్ట్రంలోని ఖరార్‌లో తలదాచుకున్న ఆయన్ను ఏసీపీ మనోజ్‌కుమార్‌ బృందం ఆదివారం అదుపులోకి తీసుకుంది. సోమవారం హైదరాబాద్‌లోని కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీపీ మనోజ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహర్ష(36) తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక ఓ కార్పొరేట్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్‌ తార్నాకలోని ఆ బ్యాంకు శాఖలో 2014 నుంచి 2017వ వరకు పనిచేసిన శ్రీహర్ష.. తనకు డబ్బులిస్తే బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తానని ఖాతాదారులను నమ్మించాడు. ఇలా వారి నుంచి రూ.లక్షలు, రూ.కోట్లలో డబ్బు తీసుకుని వడ్డీ చెల్లించేవాడు. ఈ క్రమంలో శ్రీహర్ష పదోన్నతిపై అబుదాబికి బదిలీ అయ్యాడు. అక్కడికి వెళ్లాక కూడా కొన్ని నెలలు నగదు బదిలీ చేయించుకున్నాడు. తర్వాత అసలు, వడ్డీ ఇవ్వలేదు. ఫోన్‌లో సంప్రదించినా.. స్పందించలేదు. మోసపోయామని గ్రహించిన బాధితులు అబుదాబిలోని బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని రెండేళ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితులు రెండు నెలల క్రితం సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. ఏసీపీ అబుదాబిలోని బ్యాంకు అధికారులను సంప్రదించగా.. శ్రీహర్ష బ్యాంకుకు తరచూ వచ్చే పంజాబీ యువతిని పెళ్లి చేసుకున్నాడని, తాము ఉద్యోగం నుంచి తొలగించాక ఎక్కడికి వెళ్లాడో తెలియదని వారు వివరించారు. చివరికి శ్రీహర్ష గతంలో వినియోగించిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పంజాబ్‌లోని ఖరార్‌ పట్టణంలో ఉన్నాడని గుర్తించారు. ఆదివారం అక్కడికి వెళ్లి శ్రీహర్షను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని