Attack on Teacher: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణ.. ఉపాధ్యాయుడిపై దాడి

తనపట్ల హిందీ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తెలపడంతో ఆమె బంధువులు అతడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాలిక బంధువులు, తోటి ఉపాధ్యాయులు తెలిపిన మేరకు..

Updated : 08 Sep 2021 10:04 IST
వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: తనపట్ల హిందీ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారని బాలిక తెలపడంతో ఆమె బంధువులు అతడిపై దాడికి పాల్పడిన ఘటన స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాలిక బంధువులు, తోటి ఉపాధ్యాయులు తెలిపిన మేరకు.. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక తన చేతిని హిందీ ఉపాధ్యాయుడు రవిబాబు సోమవారం రెండుసార్లు పట్టుకొని గట్టిగా నొక్కారంటూ ఇంటి వద్ద తల్లిదండ్రులకు చెప్పుకొని వాపోయింది. దీనిపై ఆగ్రహించిన ఆమె బంధువులు మంగళవారం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లి తరగతి గదిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు రవిబాబును బయటికి పిలిచి తరుముకుంటూ కొట్టడం మొదలుపెట్టారు. అది చూసిన ప్రధానోపాధ్యాయుడు గుత్తా శ్రీనివాసరావు వారిని అడ్డుకొని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఆగ్రహంతో ఉన్న బాలిక బంధువులు ఆయనపై దాడి చేయగా తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు అడ్డుకోవడానికి రాగా వారినీ కొట్టారు. అనంతరం బాలిక ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హిందీ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
 
దాడిపై ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు: ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, తనపై దాడి చేసిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ప్రధానోపాధ్యాయుడు గుత్తా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు దాడి సమాచారం అందుకున్న చేబ్రోలు సీఐ మధుసూదనరావు, వట్టిచెరుకూరు ఇన్‌ఛార్జి ఎస్సై రాజ్‌కుమార్‌ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు, బాలిక బంధువులతో మాట్లాడారు. ఈ సంఘటనపై బుధవారం జిల్లా ఉపవిద్యాశాఖాధికారి విచారించేందుకు పాఠశాలకు వస్తున్నట్లు ఎంఈవో రమాదేవి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు.

డీఎస్పీని ఆశ్రయించిన ఇరు వర్గాలు

గ్రామీణ గుంటూరు: వట్టిచెరుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన వివాదం, దాడిపై ఇరు వర్గాలు తమకు న్యాయం చేయాలంటూ గుంటూరులోని కార్యాలయంలో దక్షిణ మండలి డీఎస్పీ ప్రశాంతిని కలిశారు. విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాగా పాఠశాలలోకి దౌర్జన్యంగా ప్రవేశించి దాడి చేయడంపై ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడతామని డీఎస్పీ ప్రశాంతి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని