TS News: జబ్బుపడిన కోళ్లతో వండిన కూర తిని.. అక్క, తమ్ముడు మృతి

కోడికూర తిన్న ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా తల్లి విషమ స్థితిలో ఆసుపత్రిలో  కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాదకర ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

Updated : 18 Aug 2021 06:41 IST

 తల్లి పరిస్థితి విషమం

మనోహరాబాద్‌, తూప్రాన్‌, న్యూస్‌టుడే: కోడికూర తిన్న ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా తల్లి విషమ స్థితిలో ఆసుపత్రిలో  కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాదకర ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు గౌడ్‌ తెలిపిన వివరాలు.. తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లికి చెందిన బుల్లే మల్లేశ్‌, బాలమణి దంపతులకు కుమార్తె మనీష (13), కుమారుడు కుమార్‌(10) ఉన్నారు. మనోహరాబాద్‌ గ్రామ శివారులోని ఒక కోళ్లఫారంలో మల్లేశ్‌ దంపతులు పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఫారంలోని కోళ్లను గుత్తేదారు తీసుకెళ్లాడు. తీసుకెళ్లగా మిగిలిన అనారోగ్యం బారిన పడ్డ కోళ్లతో బాలమణి  సోమవారం రాత్రి కూర వండి పిల్లలకు పెట్టి..తానూ తిన్నది. మల్లేశ్‌ భోంచేయలేదు. మంగళవారం తెల్లవారుజామున మనీష, కుమార్‌లు కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు తెలిపి కొద్దిసేపటికే వాంతులు చేసుకున్నారు. దీంతో మల్లేశ్‌ వారిని తూప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మేడ్చల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా వారు చికిత్సకు నిరాకరించారు. తిరిగి తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే వారు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. మరి కొద్దిసేపటికి బాలమణి కూడా అస్వస్థతకు గురవగా ఆమెను తూప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి.. అనంతరం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మనోహరాబాద్‌ ఎస్‌ఐ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తండ్రి మల్లేశ్‌ను విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని