crime news: నిజామాబాద్‌లో కిడ్నాపైన మూడేళ్ల చిన్నారి క్షేమం

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ షాపింగ్‌మాల్‌ వద్ద అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Updated : 10 Oct 2021 16:59 IST

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ షాపింగ్‌మాల్‌ వద్ద అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలి వెళ్లారు. పాపను గుర్తించిన పోలీసులు నిజామాబాద్‌ తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు.  

కిడ్నాప్‌ జరిగిందిలా..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరేన్‌ తన తల్లి, మూడేళ్ల కూతురు అస్‌కియా హనీతో కలిసి ఉదయం నిజామాబాద్‌ నగరానికి వస్త్రాల కొనుగోలు కోసం వచ్చారు. కుటుంబీకులు షాపింగ్‌ ముగించుకొని బిల్లు చెల్లిస్తున్న సమయంలో చిన్నారి అస్‌కియా మాయమైంది. తన కూతురు కనిపించకపోవడంతో తల్లి షాపింగ్‌మాల్‌ సిబ్బందికి తెలపగా అంతటా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఓ మహిళ బుర్ఖాలో వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్తున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చేపట్టారు. చిన్నారి అదృశ్యమైన రెండ్రోజుల తర్వాత కూడా ఆచూకీ లభించలేదు. ఈ కేసులో నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని జల్లెడ పట్టారు. అయినా చిన్నారికి సంబంధించిన ఒక్క ఆధారమూ దొరకలేదు. చివరికి ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని