Cyber Gang: ర్యాట్‌ ద్వారా బ్యాంకుల లూటీ.. సవాలు విసురుతున్న సైబర్‌ నేరగాళ్లు 

వరుసబెట్టి బ్యాంకుల్ని లూటీ చేస్తున్న సైబర్‌ ముఠా పోలీసులకు సవాలు విసురుతోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండు బ్యాంకుల నుంచి రూ.7 కోట్లు కొల్లగొట్టింది ఒకే ముఠా...

Updated : 01 Sep 2021 16:36 IST

ఒకే ముఠా నెల రోజుల్లో రెండు సంఘటనల్లో  రూ.7 కోట్లు స్వాహా  

ఈనాడు, హైదరాబాద్‌: వరుసబెట్టి బ్యాంకుల్ని లూటీ చేస్తున్న సైబర్‌ ముఠా పోలీసులకు సవాలు విసురుతోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండు బ్యాంకుల నుంచి రూ.7 కోట్లు కొల్లగొట్టింది ఒకే ముఠా అని నిర్ధారణ అయినా అంతకు మించి వివరాలు తెలుసుకోవడం దర్యాప్తు సంస్థలకు సాధ్యం కావడంలేదు. ఈ ముఠా మరికొన్ని బ్యాంకులపైనా కన్నేసి ఉంటుందన్న అంచనాలు ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి. రిమోట్‌ యాక్సెస్‌ టూల్‌(ర్యాట్‌) ద్వారా బ్యాంకుల సర్వర్‌లోకి చొరబడి డబ్బు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు పోలీసులను ఏమార్చేందుకు ఆ సొమ్మును వేర్వేరు వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించారు. దాంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది. 

జులైలో తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.1.96 కోట్లను కొల్లగొట్టారు. ఆ సొమ్మును తొలుత మూడు ఖాతాల్లోకి మళ్లించారు. వాటి నుంచి రూ.1.94 కోట్లను సికింద్రాబాద్‌ చిరునామాతో ఉన్న ఓ మహిళ ఖాతాలోకి, అక్కడి నుంచి పది వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు. డబ్బు పోయిన విషయంపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో శేరిలింగంపల్లికి చెందిన ఇద్దర్ని అరెస్టు చేసినప్పటికీ దోచుకున్న డబ్బు జమ చేసేందుకే వీరి ఖాతాలను వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నేరగాళ్లు తొలుత ర్యాట్‌ ద్వారా బ్యాంకు ఉద్యోగి నెట్‌వర్క్‌లోకి, అక్కడినుంచి బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. 

 దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే ముంబయిలోని ఓ బహుళజాతి బ్యాంకులో రూ.5 కోట్లు కొల్లగొట్టారు. ఇందులో హైదరాబాద్‌ బ్రాంచికి చెందిన ఓ ఖాతాదారుకి సంబంధించి రూ 1.2 కోట్లు ఉన్నాయి. అయితే బ్యాంకు అధికారులు ఈ డబ్బును ఖాతాదారుకి చెల్లించి ముంబయిలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు.. కొల్లగొట్టిన డబ్బు జమ అయిన దిల్లీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేయగా ఆయనకు ఈ నేరంతో సంబంధం లేదని వెల్లడైంది. ఇక్కడ కూడా సైబర్‌ ముఠా ర్యాట్‌ ద్వారా బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి ఎంపిక చేసిన ఖాతాదారులకు ఓటీపీ వచ్చే ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ ఐడీలను మార్చారు. అనంతరం వారి ఖాతాల్లోని డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు బ్యాంకుల్లోనూ డబ్బు కొల్లగొట్టింది ఒకటే ముఠా అని, ఈ ముఠా గతంలో బంగ్లాదేశ్‌లోని ఫెడరల్‌ బ్యాంకులోనూ ఇదే తరహాలో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసుల్లో డబ్బు జమ అయిన ఖాతాదారులను పట్టుకోగలిగినా దర్యాప్తు అంతకు మించి ముందుకు సాగడంలేదు. 

 ఉదాహరణకు హైదరాబాద్‌ కేసులో తొలుత బ్యాంకు డబ్బు ఇద్దరు అన్నదమ్ముల ఖాతాలోకి మళ్లించారు. అక్కడ నుంచి సికింద్రాబాద్‌ చిరునామాతో ఉన్న యువతి ఖాతాలోకి మళ్లించారు. ఈ యువతి ఖాతా తెరిచేటప్పుడు ఇచ్చిన చిరునామా, ఆధార్‌కార్డు నకిలీదని తేలింది. దాంతో ఈ యువతి ఎవరన్నది తెలుసుకోవడం సాధ్యం కావడంలేదు. ముంబయి కేసులోనూ ఇదే పరిస్థితి. 

  కేవలం డబ్బు జమ అయిన ఖాతాదారులను పట్టుకున్నప్పటికీ వారు తమ ఖాతాల్లో పడ్డ డబ్బును డ్రా చేసి వేరేవాళ్లకి ఇచ్చామని, వారెవరో తమకు తెలియదని చెబుతున్నారు. దాంతో అసలు నిందితులు మాత్రం పట్టుబడటంలేదు. ఈ నేపథ్యంలో.. బ్యాంకుల్లోకి చొరబడి డబ్బు కొల్లగొడుతున్న ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. అయినా ఆ ముఠా గుట్టు రట్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని