Fake Currency: రూ.2వేల నోట్లు రద్దవుతున్నాయంటూ స్థిరాస్తి వ్యాపారికి టోకరా!

నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠా రాచకొండ కమిషనరేట్ పోలీసులకు చిక్కింది. నల్లధనాన్ని మార్చుకునేందకు కొందరు ధనికులు 500 రూపాయల నోట్లను తీసుకొని..

Published : 12 Sep 2021 01:12 IST

హైదరాబాద్‌: నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠా రాచకొండ కమిషనరేట్ పోలీసులకు చిక్కింది. నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు ధనికులు 500 రూపాయల నోట్లను తీసుకొని 2వేల రూపాయలు ఇస్తున్నారంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడింది.  ఈ విషయాలను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాకు వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో త్వరలో 2వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నారని, వాటిని అతి తక్కువ ధరకు దక్కించుకోవచ్చని ఈ ముఠా నమ్మించింది. సినిమాలో చిత్రీకరణ కోసం ఉపయోగించే డమ్మీ 2వేల రూపాయల నోట్లను చూపించి కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా మోసాలకు పాల్పడింది. నిందితులను అరెస్టు చేసి కోటి రూపాయల నకిలీ 2వేల నోట్లను, ఓ వాహనాన్ని కీసర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే భాగ్యలక్ష్మికి అజీజ్‌ అనే పాత నేరస్థుడితో పాటు, అన్వర్, సుభాష్‌, నాగరాజుతో పరిచయం ఏర్పడింది. 

డబ్బుల కోసం మోసాలకు పాల్పడేందుకు ఈ ముఠా నిర్ణయించుకుంది. రాజిరెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారిని ముందుగా భాగ్యలక్ష్మి పరిచయం చేసుకుంది. కోటీశ్వరులు నల్లధనాన్ని అతి తక్కువ నగదుకే ఇస్తున్నట్లు అతన్ని నమ్మించింది. 2వేల రూపాయల నోట్లు రద్దవుతున్నాయని.. ధనికులంతా 500, 200 రూపాయల నోట్లు తీసుకొని 2వేల రూపాయల నోట్లు ఇస్తున్నట్టు చెప్పింది. నల్లధనం తీసుకోవడానికి రాజిరెడ్డి తన వద్ద ఉన్న రూ.5 లక్షలు తీసుకొని శామీర్‌పేటలోని ఓ ఫామ్‌ హౌజ్‌ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అన్వర్‌, అతని ముఠా సభ్యులు అక్కడ మాటు వేశారు. ముఠాలోని ఓ సభ్యుడు పోలీసు దుస్తులు వేసుకొని రాజిరెడ్డిని బెదిరించాడు. నల్లధనం దందా చేస్తున్నావా? అని బెదిరించి అతని వద్ద ఉన్న సొమ్మును తీసుకొని ఉడాయించాడు. వారం తర్వాత రాజిరెడ్డి తనకు జరిగిన మోసాన్ని కీసర పోలీసులకు తెలియజేయడంతో నకిలీ నోట్ల దందా బయటపడింది. సీసీ కెమెరాల దృశ్యాలు, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా ఇంకా ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడిందనే విషయాలపై కీసర పోలీసులు ఆరా తీస్తున్నారు.

నకిలీ నోట్లు ఎలా వచ్చాయంటే..
ముఠా సభ్యుల్లో సుభాష్ సినీరంగంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సనత్ నగర్‌కు చెందిన ఇతనికి గతంలోనే ఆజామ్, అన్వర్‌లతో పరిచయం ఉంది. అన్వర్ కూడా లఘు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంటాడు. మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్న ముఠా సభ్యులు.... సుభాష్ ద్వారా ఓ ఆర్ట్ డైరెక్టర్‌ను కృష్ణానగర్‌లో సంప్రదించారు. ఆజమ్‌ను దర్శకుడిగా పరిచయం చేసుకున్నాడు. ఓ లఘు చిత్రం తీయడానికి నకిలీ 2వేల నోట్లు కావాలని సుభాష్ ఆర్ట్ డైరెక్టర్‌ను కోరాడు. అన్వర్ పోలీస్ పాత్ర పోషిస్తున్నాడని అతనికి డ్రామా డ్రెస్ కంపెనీలో పోలీసు దుస్తులు ఇప్పించాలని కోరాడు. నిజమని నమ్మిన ఆర్ట్ డైరెక్టర్..  కృష్ణానగర్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ నోట్లతో పాటు పోలీసు డ్రెస్‌ను సుభాష్‌కు సమకూర్చాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని