
Ap News: మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత
యాడికి: అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డిపల్లిలో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిని 12 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత మొదటగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చిన్న పిల్లల వైద్యులు లేనందున తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అక్కడనుంచి మొదటగా ఐదుగురిని అంబులెన్స్‌లో తాడిపత్రికి తరలించారు. తాడిపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలోనే మరో ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే అస్వస్థతకు గురైన చిన్నారులు మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారని సమాచారం. మానసిక స్థితి సరిగా లేని వారి విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ప్రథమ చికిత్స అనంతరం 12 మందిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు అంతా అక్కడ చికిత్స పొందుతున్నారు.
ఈ పాఠశాలలో 18 మంది విద్యార్థులుండగా వీరికి మధ్యాహ్న భోజనం మెనూలో అన్నం, ఆకుకూరపప్పు, చిక్కీలు, కోడిగుడ్లు వడ్డించారు. వీరికి వడ్డించిన మధ్యాహ్న భోజనం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు పర్యవేక్షణలో కాకుండా ఏజెన్సీ నిర్వాహకురాలు తన ఇంటి వద్దనే వండుకొని వచ్చి వడ్డించిందని, అక్కడే ఏదో జరిగి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.