Updated : 31/10/2021 07:16 IST

Road Accident: రోడ్డు ప్రమాదంలో కుటుంబమే కూలిపోయింది

నలుగురి దుర్మరణం 

న్యూస్‌టుడే, బత్తలపల్లి, ధర్మవరం 

విధి ఎవరిని ఎప్పుడు ఎలా బలితీసుకుంటుందో.. ఎవరికీ తెలియదు. శుభకార్యంలో పాల్గొనేందుకు ఆనందంగా కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని పంక్చరు రూపంలో మృత్యువు కబళించింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన సంఘటన శనివారం సాయంత్రం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... బత్తలపల్లి మండలం జ్వాలాపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం కారు, లారీ ఢీకొన్న ఘటనలో అమ్మాజీ (50), ఆమె కొడుకు రెడ్డి బాషా (25), కూతురు రేష్మా (30), అల్లుడు బాబు బుడాన్‌ (36) మృతి చెందారు. జాస్మియాబాను అనే చిన్నారికి గాయాలయ్యాయి. 

తనకల్లు మండలం పెద్దకడపలవారిపల్లికి చెందిన అమ్మాజీ, రెడ్డిపీరా కుటుంబం జీవనాధారం కోసం 15 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లా మదనపల్లెకి వెళ్లింది. రెడ్డిపీరా క్రషర్‌ మిషన్‌లో పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఏటా ఖరీఫ్‌లో పెద్దకడపలవారిపల్లికి వచ్చి పంటలు సాగు చేస్తుండేవారు. అనంతపురంలో ఆదివారం జరిగే బంధువుల వివాహ కార్యక్రమానికి వీరంతా మదనపల్లి నుంచి కారులో బయలుదేరారు. జ్వాలాపురం వద్దకు రాగానే కారు టైరు పంక్చరు కావడంతో అదుపుతప్పి అనంతపురం నుంచి చెన్నై వెళుతున్న లారీని ఢీకొంది. కారు - లారీ వేగంగా ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే నలుగురూ మృతి చెందారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న ధర్మవరం డీఎస్పీ  రమాకాంత్‌, బత్తలపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం పెద్దకడపలవారిపల్లి, మదనపల్లెలో నక్కలదిన్నెలోని బంధువుల ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. రెడ్డిపీీరా కన్నీటిపర్యంతమయ్యారు. దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. ప్రమాద ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

ఇక్కడే ఉన్నా బాగుండు..  

తనకల్లు: అనంతపురంలో సమీప బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు మదనపల్లె నుంచి కారులో బయల్దేరిన అమ్మాజీ కుటుంబం తనకల్లులోని గ్యాస్‌ కార్యాలయ సమీపంలో నివాసముండే మేనమామ హుస్సేన్‌సాబ్‌ను కలిసింది. మేనమామ ఇంటికి వెళ్లి టీ తాగిన అమ్మాజీ, కుమార్తె రేష్మా, అల్లుడు బాబు, కుమారుడు రెడ్డిబాషాలు అనంతరం శనివారం సాయంత్రం అనంతపురానికి బయలుదేరారు. వివాహం ఆదివారం ఉన్నందున రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం వెళ్లాలని చెప్పామని, తమమాట విని ఉంటే ప్రాణాలతో ఉండేవారని హుస్సేన్‌సాబ్‌ కుటుంబ సభ్యులు విలపించారు. తమ యోగక్షేమాలు ఆరా తీసి వెళ్లిన గంటలోనే ఇలాంటి విషాదకర మాట వినాల్సి వచ్చిందని రోదించారు.  

మృత్యుంజయురాలు ఆ చిన్నారి  

ఈ ప్రమాదంలో జాస్మియాబాను అనే అయిదేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ప్రమాద సమయంలో చిన్నారి కారులో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు గమనించి బాలికను వెలికితీశారు. వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం నగరంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. అమ్మ, అమ్మమ్మ మధ్యన కూర్చొని ప్రయాణిస్తుండటం వల్లే చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడిందని బత్తలపల్లి పోలీసులు తెలిపారు.  

ప్రాణం నిలిపిన పింఛను 

రెడ్డిపీరా తల్లి ఇమామ్‌బీ సైతం కారులో వివాహానికి బయలుదేరి వెళ్లింది. నవంబరు 1న వృద్ధాప్య పింఛను తీసుకోవాలన్న విషయం గుర్తు చేసుకున్నారు. మార్గమధ్యలోనే ఆమె స్వగ్రామం అనంతపురం జిల్లా తనకల్లు మండలం కడపలవారిపల్లెలో విడిచిపెట్టి వెళ్లారు. దీంతో వృద్ధురాలు ప్రాణాలతో బయటపడ్డారంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.  


నక్కలదిన్నెలో విషాదం 

రెడ్డిపీరా కుటుంబ సభ్యులు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారని మదనపల్లెలో ఆయన నివాసం చుట్టుపక్కల వారు గుర్తు చేసుకుంటూ విలపించారు. మధ్యాహ్నమే ఎంతో ఆనందంగా బయలుదేరి వెళళ్లారని, ఇల్లును జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాజీ వదిన షకీల భాను విషాద వార్త వినగానే స్పృహ కోల్పోయారు. ఇంటిని జాగ్రత్తగా చూసుకోమంటూ వెళ్లిన వారు... ఇంతలోనే ప్రాణాలు కోల్పోయారా... అంటూ విలపించారు. రెడ్డిపీరా ప్రస్తుతం అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. కుటుంబం స్థిరపడటంతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. జనవరిలో గృహప్రవేశం చేయాల్సి ఉండగా ఈ పరిణామం జరిగింది. గత ఏడాది ఇదే పట్టణం నుంచి ఆధ్యాత్మిక యాత్రకు వెళుతూ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఆ తర్వాత మరో ఘటన జరిగింది. శనివారం ఘటనలో మరణించిన వారి మృతదేహాలకు తనకల్లు మండలంలోని స్వగ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.


 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని