Suicide: కన్నబిడ్డలు కన్నుమూశారని.. వేదనతో 98 ఏళ్ల వృద్ధురాలి బలవన్మరణం

ఓ వృద్ధురాలు 98 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కట్టుకున్న తోడు, కన్న బిడ్డలు కళ్లముందే ఒక్కొక్కరుగా మరణించడాన్ని తట్టుకోలేక తనువు చాలించారు. ఎస్సార్‌నగర్‌

Updated : 02 Nov 2021 06:45 IST

కమలమ్మ

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఓ వృద్ధురాలు 98 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కట్టుకున్న తోడు, కన్న బిడ్డలు కళ్లముందే ఒక్కొక్కరుగా మరణించడాన్ని తట్టుకోలేక తనువు చాలించారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుందీ విషాద ఘటన. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన కమలమ్మ(98) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఎస్సార్‌నగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉంటున్నారు. ఆమె భర్త 1981లో కన్నుమూశాడు. తరువాత కొద్దిరోజులకే పెద్ద కుమార్తె పద్మావతి అనారోగ్యంతో మరణించారు. 2020 ఆగస్టులో కుమారుడు రాఘవేందర్‌రావు, కోడలు కరోనాతో మృత్యువాతపడటంతో ఆమె మనోవేదనకు గురయ్యారు. అప్పట్నుంచి మనవడు(రాఘవేందర్‌రావు కుమారుడు) డాక్టర్‌ కమల్‌ రామ్‌జీ ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. చిన్న కుమార్తె జోహర్మతి 9 నెలల కిందట డెంగీతో మరణించడంతో ఆమె మరింత కుంగిపోయారు. గతంలో తానుంటున్న అపార్టుమెంటు పైనుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్‌ వాసులు సకాలంలో గుర్తించి, ఆమెను రక్షించారు. అప్పట్నుంచి మనవడు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. శనివారం కమల్‌ రామ్‌జీ, ఆయన భార్య విధి నిర్వహణ నిమిత్తం బయటకు వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి తలుపు మూసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. మారుతాళంతో తలుపు తెరిచారు. కమలమ్మ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్టు గుర్తించి హతాశులయ్యారు. వారి ఫిర్యాదుతో ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని