బాలిక హత్యకేసు.. కలెక్టర్‌ హామీతో ఆందోళన విరమించిన స్థానికులు

నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనపై

Published : 11 Sep 2021 02:35 IST

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు ఎట్టకేలకు కలెక్టర్‌ హామీతో ఆందోళన విరమించారు. చంపాపేట నుంచి సాగర్‌ వెళ్లే రోడ్డులో కాలనీవాసులు బైఠాయించి దాదాపు 7 గంటల పాటు నిరసన తెలిపారు. బాలికపై అత్యాచారం చేసి చంపేశాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయడంతో పాటు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు. మరోవైపు బాధితుల ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు యత్నించినా ఫలితంలేకపోయింది. వారిని సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా ఆందోళనకారులు, బాధిత కుటుంబసభ్యులు వెనక్కి తగ్గ లేదు.

అత్యాచారం చేసి గొంతునులిమి హత్యచేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి

 ఈ క్రమంలో ఆందోళనకారుల వద్దకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, డీసీసీ రమేశ్‌రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని.. రెండు పడక గదుల ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.50వేలు అందజేశారు. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. బెల్టు షాపులు, గుడుంబా లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కలెక్టర్‌ హామీతో ఆందోళన విరమించారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ రమేశ్‌రెడ్డి తెలిపారు. మరోవైపు నిందితుడి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సమాచారం కోసం వారిని ప్రశ్నిస్తున్నారు. సైదాబాద్‌ సింగరేణి ప్రాంతంలో సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. చిన్నారి మృతదేహానికి ఉస్మానియా మర్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్యచేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని