Crime news: పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఎస్సై దారుణ హత్య

పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఓ ఎస్సై దారుణ హత్యకు గురయ్యారు. తమను అడ్డుకున్న ఎస్సైను ఓ దొంగల ముఠా సభ్యులు నరికి చంపారు......

Published : 22 Nov 2021 01:28 IST

చెన్నై: పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఓ ఎస్సై దారుణ హత్యకు గురయ్యారు. తమను అడ్డుకున్న ఎస్సైను ఓ దొంగల ముఠా సభ్యులు నరికి చంపారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లాలో జరిగింది. నావల్​పట్టు పోలీసుస్టేషన్‌లో భూమినాథన్​ (56) సబ్ ​ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి ఆయన పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. నావల్​పట్టు ప్రధాన రహదారిలో బైకులపై కొందరు మేకలను అనుమానాస్పదంగా తరలిస్తున్న విషయాన్ని ఆయన గుర్తించారు. దీంతో ఆ ముఠాను ఆపిన భూమినాథన్.. వారి గురించి ఆరా తీయడం ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మేకలను దొంగిలించే ముఠాగా వారిని గుర్తించారు. అయితే అక్కడ నుంచి వారు పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఎస్సై తన ద్విచక్ర వాహనంతో వారిని వెంబడించారు.

పారిపోయితున్న ముఠాను కలమావూరు రైల్వే గేట్ సమీపంలోని పల్లతుపట్టి గ్రామం వద్ద ఎస్సై అడ్డుకుని.. ముఠాలోని ఇద్దరు సభ్యులను పట్టుకున్నారు. అయితే తప్పించుకున్న మిగతా సభ్యులు తిరిగి వచ్చి భూమినాథన్‌తో గొడవకు దిగారు. వారిని విడిచిపెట్టాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్‌ఐ నిరాకరించడంతో రెచ్చిపోయిన వారు.. తమ వద్ద ఉన్న పదునైన ఆయుధాలతో ఎస్​ఐపై దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన భూమినాథన్​ అక్కడికక్కడే మృతి చెందారు.

అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఉదయం 5 గంటలకు బాటసారులు.. ఎస్సై​ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని