crime news: వ్యాపారి శ్రీనివాస్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో వ్యాపారి శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని

Updated : 11 Aug 2021 17:59 IST

మెదక్‌: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో వ్యాపారి శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని శివను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని మెదక్‌ ఎస్పీ చందన దీప్తి మీడియాకు వెల్లడించారు.  సాంకేతిక ఆధారాల సాయంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించామన్నారు. శ్రీనివాస్‌ గొంతు కోసి చంపినట్టు పోస్టు మార్టం రిపోర్టులో తేలిందని చెప్పారు. శివ, పవన్‌, నిఖిల్‌ కలిసి శ్రీనివాస్‌ను హత్య చేశారు. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కారులో పెట్టి దగ్ధం చేశారని వివరించారు. ప్రధాన నిందితుడు శివను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. హత్యకు గల కారణం మాత్రం పూర్తిగా నిర్ధరణ కాలేదని, వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. పూర్తి ఆధారాలు లభించిన తర్వాతే కచ్చితంగా చెబుతామని పేర్కొన్నారు.  

తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తరచూ తనతో గొడవ పడేవారని మృతిచెందిన వ్యాపారి శ్రీనివాస్‌ భార్య నిన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురితో స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లోనూ గొడవలు జరుగుతున్నాయని కూడా ఆమె చెప్పారు. ఈ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. శ్రీనివాస్‌ మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటంతో  కృత్రిమ దంతాల ఆధారంగా కారులోని మృతదేహం శ్రీనివాస్‌దే అని నిన్న ఆయన కుటుంబ సభ్యులు గుర్తించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని