NCRB Report: పెరిగిన ఆత్మహత్యలు.. నిత్యం 418 మంది బలవన్మరణం!

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. వివిధ కారణాలతో గతేడాది మొత్తం లక్షన్నర మందికిపైగా ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది.

Published : 29 Oct 2021 19:18 IST

జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ సమయంలో ఆత్మహత్యలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా మొత్తం లక్షన్నర మందికిపైగా ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది. నిత్యం 418 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపింది. దేశంలో వివిధ కారణాల వల్ల ప్రాణాలు తీసుకుంటున్న వారిసంఖ్య గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం మరణాలు ఎక్కువ నమోదయ్యాయి. 2019లో మొత్తం లక్షా 39వేల మంది ప్రాణాలు తీసుకోగా 2020లో ఈ సంఖ్య లక్షా 53 వేలకు పెరిగింది. ప్రతి పదిలక్షల జనాభాకు 10.4గా ఉన్న ఆత్మహత్యల రేటు 11.3కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

మహారాష్ట్రలో అత్యధికం..

దేశంలో అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ట్రలో చోటుచేసుకున్నాయి. 2020లో అక్కడ 19వేల (19,909) మంది ప్రాణాలు తీసుకున్నారు. తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 16,883 మంది, మధ్యప్రదేశ్‌లో 14,578, పశ్చిమబెంగాల్‌లో 13,103, కర్ణాటకలో 12,259 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. దేశంలో గతేడాది ఆత్మహత్యకు పాల్పడిన మొత్తం కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50.1శాతం ఉన్నాయి. మిగతా 49.9 శాతం మరణాలు మిగిలిన 23 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో సంభవించాయి. అయితే, దేశ జనాభాలో దాదాపు 17 శాతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉండగా అక్కడ ఆత్మహత్యల రేటు (3.1శాతం) కాస్త తక్కువగా ఉండడం ఊరట కలిగించే విషయం. ఇక నగరాల విషయానికొస్తే.. దేశ రాజధాని దిల్లీలో ఎక్కువ ఆత్మహత్యలు (3,142) చోటుచేసుకున్నాయి.

కుటుంబ సమస్యలతోనే ఎక్కువ..

ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం, మహానగరాల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు సంభవించాయి. దేశంలో గతేడాది 53 నగరాల్లో 23,855 (14.8) మంది ప్రాణాలు కోల్పోగా.. ఇది జాతీయ సగటు (11.3) కంటే ఎక్కువ. అయితే, బలవన్మరణాలకు కుటుంబ సమస్యలే ప్రధాన కారణమని తాజా నివేదిక పేర్కొంది. గతేడాది ప్రాణాలు కోల్పోయిన బాధితుల్లో 33.6 శాతం కుటుంబ సమస్యలతోనే ప్రాణాలు విడిచారు. అనారోగ్యం కారణాలతో 18 శాతం, వివాహానికి సంబంధించిన సమస్యలతో 5 శాతం మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ఇక ఆత్మహత్యలకు పాల్పడిన బాధితుల్లో 70.9 శాతం మంది పురుషులే కాగా.. 29.1 శాతం మహిళలు ఉన్నారు.

ఏడాదిలోనే 10శాతం పెరిగిన ఆత్మహత్యలు..

ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి, గృహిణిలే ఎక్కువగా ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2016లో దేశవ్యాప్తంగా 1,31,008 మంది ప్రాణాలు తీసుకోగా 2017లో ఆ సంఖ్య లక్షా 29 వేలకు తగ్గింది. అనంతరం తదుపరి సంవత్సరాల్లో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2018లో 1,34,516 మంది, 2019లో 1,39,123 మంది ఆత్మహత్యకు పాల్పడగా 2020లో ఏకంగా లక్షా 53వేల మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. మునుపటి ఏడాదితో పోలిస్తే ఏకంగా పదిశాతం ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే విషయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని