Gun Fire: జవాన్ల మధ్య గొడవతో కాల్పులు.. నలుగురి మృతి

దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా

Updated : 08 Nov 2021 10:10 IST

దుమ్ముగూడెం: దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని పారామిలిటరీ బలగాల శిబిరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పరిధిలో గల లింగంపల్లి బేస్‌ క్యాంప్‌లో సోమవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో జవాన్ల మధ్య కాల్పుల ఘటన జరిగింది. కానిస్టేబుల్‌ రితేష్‌ రంజన్‌ తన సర్వీసు తుపాకీ ఏకే-47తో తోటి జవాన్లపై కాల్పులకు పాల్పడినట్లు రాయ్‌పూర్‌ ఐజీ(బస్తర్‌ రేంజ్‌) సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడగా.. వారిని వెంటనే తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నలుగురు జవాన్లు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మృతిచెందిన జవాన్లను రాజమణి కుమార్‌ యాదవ్‌, రాజవివ్‌ మండల్‌, ధన్‌జీ, ధర్మేంద్ర కుమార్‌గా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురికి భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించారు. కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్‌ రితేష్‌ రంజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెలవుల విషయంలో జవాన్ల మధ్య తలెత్తిన గొడవ.. కాల్పులకు దారితీసినట్లు పోలీసు వర్గాల సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని