Crime news: ఒంటరి మహిళలను అంతం చేసే ఇద్దరు నిందితులు అరెస్టు

బెజవాడలో కరుడుగట్టిన ఇద్దరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని  హత్యలు, దోపిడీలకు పాల్పడుతోన్న ఇద్దరు

Updated : 05 Sep 2021 02:15 IST

విజయవాడ: బెజవాడలో కరుడుగట్టిన ఇద్దరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని  హత్యలు, దోపిడీలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈకేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు శనివారం మీడియాకు వెల్లడించారు. నున్న పోలీసుస్టేషన్‌ పరిధిలోని కుందావారి కండ్రిక వద్ద గత నెల 26న మున్నంగి సుబ్బమ్మ (75)ను గుర్తు తెలియని వ్యక్తి కిరాతకంగా కొట్టి గాయపరచి.. ఆమె మెడలోని బంగారు ఆభరణాలను అపహరించాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించగా ద్విచక్ర వాహనంపై వాంబే కాలనీకి చెందిన పల్లె రాము అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. కేదారేశ్వరిపేటకు చెందిన అతని స్నేహితుడు నాగరాజుతో కలిసి మూడు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు రాము గతంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. రైలు ప్రమాదంలో తన కుడికాలుకు గాయమై కాలు కింది భాగాన్ని తొలగించారు. దీంతో కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. తనకున్న చెడు వ్యసనాలను తీర్చుకునేందుకు తేలికగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుని నేరాలు చేయడం ప్రారంభించాడని సీపీ తెలిపారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలతో పరిచయం పెంచుకుని బంగారు ఆభరణాలను దొంగలించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాయకాపురం ప్రాంతంలో సత్యవతి (80) అనే మహిళ ఇంట్లోనూ ఇదే తరహా దొంగతనం చేశాడని.. ఆమెను బలంగా నెట్టేయడంతో తలకు గాయమై చనిపోయిందని వివరించారు. మార్చి 27న అజిత్‌సింగ్‌ నగర్‌లో వెంకాయమ్మ (75) దగ్గరకు అద్దె ఇల్లు కావాలని వెళ్లి బంగారు అభరణాలు దొంగిలించినట్లు సీపీ వెల్లడించారు. ఈ మూడు నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని