Crime News: ప్రియుడితో కలిసుండేందుకు భర్తను కిడ్నాప్‌ చేయించిన భార్య

ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను కిడ్నాప్‌ చేయించి బలవంతంగా విడాకులు తీసుకుందో వివాహిత. బాధితుడిని రక్షించిన పోలీసులు.. మహిళతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్‌

Updated : 29 Sep 2021 15:36 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను కిడ్నాప్‌ చేయించి బలవంతంగా విడాకులు తీసుకుందో వివాహిత. బాధితుడిని రక్షించిన పోలీసులు.. మహిళతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. మార్కెట్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌వాజీద్‌ (31), ఆప్షియా బేగం(24)లకు 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వాజీద్‌ బస్టాండ్‌ ప్రాంతంలోని చెప్పుల దుకాణంలో సేల్స్‌మెన్‌. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆప్షియాబేగంకు ముషీరాబాద్‌కు చెందిన క్యాటరింగ్‌ పనులు చేసే ఆసిఫ్‌ పరిచయమయ్యాడు. అతనికి గతంలో రెండుసార్లు వివాహం జరిగి పిల్లలున్నారు. ఆప్షియా బేగం గత ఏప్రిల్‌లో ఇంట్లో చెప్పకుండా ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. ఆమె భర్త మల్కాజిగిరి ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను గుర్తించి భర్తకు అప్పగించారు. అయినా మరోసారి పిల్లలతో కలిసి ప్రియుడి వద్దకే వెళ్లిపోవడంతో అత్తామామల సహాయంతో తిరిగి తీసుకొచ్చాడు. భర్తతో ఉండటం ఇష్టం లేదని.. విడాకుల కోసం ఆమె ఒత్తిడి తెచ్చింది. అందుకు అతడు అంగీకరించలేదు. ఎలాగైనా ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆప్షియా బేగం అతడితో కలిసి కిడ్నాప్‌ పథకం వేసింది. దీంతో ఆసిఫ్‌ ముషీరాబాద్‌, పార్సిగుట్టకు చెందిన ఇమ్రాన్‌ మహ్మద్‌(31), ఎండి జాఫర్‌(33), ఇర్ఫాన్‌ అహ్మద్‌, మహమూద్‌లను ఇందుకు సిద్ధం చేశాడు. వీరు నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌లో వాజీద్‌ పనిచేస్తున్న దుకాణం వద్దకు వెళ్లి అతడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ముషీరాబాద్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి అప్పటికే వారు సిద్ధం చేసుకుని ఉంచిన మతపెద్దల సమక్షంలో విడాకులు ఇప్పించుకున్నారు. వాజీద్‌ కిడ్నాప్‌ విషయాన్ని అదేరోజు రాత్రి దుకాణదారులు మార్కెట్‌ పోలీసులకు తెలియజేశారు. బాధితుడి ఫోన్‌ లోకేషన్‌ ఆధారంగా  వాజీద్‌ను కాపాడారు. ఆప్షియాబేగంతోపాటు కిడ్నాప్‌నకు పాల్పడిన ఇమ్రాన్‌ అహ్మద్‌, జాఫర్‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఆసిఫ్‌తోపాటు ఇర్ఫాన్‌ అహ్మద్‌, మహమూద్‌ల కోసం గాలిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని