Jammu Kshmir: మరో ఇద్దరు స్థానికేతరులను కాల్చిచంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొన్న మిలిటెంట్లు ఆదివారం మరో ఇద్దరి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు.....

Updated : 18 Oct 2021 12:31 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతున్నాయి. స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొన్న మిలిటెంట్లు శనివారం ఇద్దరిని కాల్చివేయగా.. ఆదివారం మరో ఇద్దరి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు బిహార్‌కు చెందిన ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వాన్‌పో గ్రామంలో నివాసముంటున్న రాజా రిషి దేవ్‌ ఇంట్లోకి చొరబడిన ముష్కరులు ఆ ఇంట్లోని వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో రాజాతోపాటు జోగిందర్‌  దేవ్‌ అనే వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. వీరంతా స్థానికంగా కూలీ పని చేసుకునేవారుగా తెలుస్తోంది.

శనివారం రెండు చోట్ల ఉగ్రవాదులు ఇదే తరహా ఘటనకు పాల్పడ్డారు. శ్రీనగర్‌లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో ఓ కార్పెంటర్‌ని కాల్చి చంపారు. శ్రీనగర్‌లో మృతి చెందిన వ్యక్తిని బిహార్‌కు చెందిన అర్వింద్‌ కుమార్‌(37)గా పోలీసులు గుర్తించారు. పుల్వామా జిల్లాలో జరిగిన దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్పెంటర్‌ సాగిర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో పోలీసులు, కేంద్ర బలగాలు భారీ ఎత్తున కట్టడిముట్టడి చర్యలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతోపాటు వారం వ్యవధిలో పలు ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని