మోస్ట్‌వాంటెడ్‌ భలే దొరికాడు..! 

కశ్మీర్‌ పోలీసులకు నేడు బాగా కలిసొచ్చింది.. కశ్మీర్‌లో బుర్హాన్‌ వానీ తర్వాత ఆ స్థాయి ఉగ్రవాదిగా పేరున్న మెహ్రాజుద్దీన్‌ హల్వాయి అనుకోకుండా దొరికాడు. 2013 నుంచి దళాలు

Updated : 08 Jul 2021 03:04 IST

 నాటకీయంగా మెహ్రాజుద్దీన్‌ హల్వాయి ఎన్‌కౌంటర్‌  

ఇంటర్నెట్‌డెస్క్‌

కశ్మీర్‌ పోలీసులకు నేడు బాగా కలిసొచ్చింది.. కశ్మీర్‌లో బుర్హాన్‌ వానీ తర్వాత ఆ స్థాయి ఉగ్రవాదిగా పేరున్న మెహ్రాజుద్దీన్‌ హల్వాయి అనుకోకుండా దొరికాడు. 2013 నుంచి దళాలు అతని ఆచూకీ కోసం వెతుకున్నాయి. నేడు రోడ్డుపై తారసపడ్డాడు. సరే దొరికాడు కదా అని ఇంటరాగేషన్‌ చేశారు. తన స్థావరం చూపిస్తానని భద్రతా దళాలను నమ్మించి ఓ చోటకు తీసుకుపోయాడు. అక్కడ సమీపంలో దాచిన ఆయుధాన్ని తీసి కాల్పులు జరపడంతో దళాలు ప్రతిదాడి చేయడంతో హతమయ్యాడు. ఇటీవల కాలంలో కశ్మీర్‌లోని దళాలకు లభించిన అతిపెద్ద విజయంగా ఐజీపీ విజయ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. 

కొవిడ్‌ నాకాబందీలో..

పోలీసులు, సశస్త్రసీమాబల్‌, ఇతర దళాలు మంగళవారం కొవిడ్‌-19 నిబంధనల అమలును పరిశీలించేందుకు హండ్వార వద్ద నాకాబందీ నిర్వహించాయి. ఒక చోట చాలా వాహనాలు ఉండటంతో దళాలు అక్కడికి వెళ్లాయి. దానికి సమీపంలో ఒక పాదచారి అనుమానాస్పదంగా ప్రవర్తించడాన్ని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశాయి. ఒక గ్రెనేడ్‌ దొరికింది. వెంటనే అతన్ని సమీపంలోకి పోలీస్‌ పోస్టుకు తరలించి ప్రశ్నించడం మొదలుపెట్టాయి. అతని పేరు తెలుసుకొని అవాక్కవ్వడం దళాల వంతైంది. ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నహిజ్బుల్‌ కమాండర్‌ మెహ్రాజుద్దీన్‌ అతనే ధ్రువీకరించుకొన్నారు. అతని స్థావరం వివరాలు తెలుసుకొని దానిని ధ్రువీకరించుకొనేందుకు వెంట తీసుకెళ్లాయి. అక్కడికి వెళ్లగానే అతను సమీపంలో దాచిన ఏకే-47ను బయటకు తీసి దళాలపై కాల్పులు జరిపాడు. దీంతో దళాలు ప్రతిదాడి చేయడంతో చనిపోయాడు. అక్కడి నుంచి ఏకే-47, నాలుగు మ్యాగ్జైన్లలో తూటాలు, పవర్‌ బ్యాంక్‌,ఔషధాలు స్వాధీనం చేసుకొన్నారు. 

ఎవరీ మెహ్రాజుద్దీన్‌..?

12వ తరగతి వరకు చదువుకొన్న మెహ్రాజుద్దీన టెక్నాలజీ వాడటంలో దిట్ట. కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా చేశాడు.  2011లో ఉగ్రవాదిగా మారాడు.  టెక్నాలజీని వాడుకొని  పోలీసులనుంచి తప్పించుకొనేవాడు. 2015 నాటికే ఉత్తర కశ్మీర్లో బాగా చురుగ్గా ఉన్నాడు. పోలీసుల వేట పెరగడంతో కొన్నాళ్లు పాకిస్థాన్‌లో తలదాచుకొని వచ్చాడు. ఇక దక్షిణ కశ్మీర్లో బుర్హాన్‌ వానీ వలే మెహ్రాజుద్దీన్‌ ఉత్తర కశ్మీర్‌లో యువతను ఉగ్రవాదంలోకి లాగుతుంటాడు.  అతడిని పోలీసులు ఏ++ కేటగిరి ఉగ్రవాదిగా ప్రకటించారు. కశ్మీర్‌లో టాప్‌ 10 ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు.   

భద్రతా సిబ్బంది.. ప్రజలే లక్ష్యంగా..

మెహ్రాజుద్దీన్‌ భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజలను లక్ష్యంగాచేసుకొని దాడులు చేసేవాడు. 2013లో అతను చెలరేగిపోయాడు. పలు హత్యలు చేశాడు.  ఎస్పీవో ముదాసిర్‌ అహ్మద్‌ దార్‌ హత్య, అదే ఏడాది నలుగురి పోలీసుల హత్య,  హబీబుల్‌ మీర్‌ అనే వ్యక్తిని చంపాడు. హరియత్‌ కార్యకర్త ఆల్తాఫ్‌ హత్య కూడా అతని పనే. మాజీ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్‌ దార్‌ను కూడా ఇతనే చంపాడు.  శ్రీనగర్‌లో హిమాల్‌ హోటల్‌పై దాడిలో కూడా ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు