నాలుగో అంతస్తు నుంచి మరో భవనంపైకి దూకారు! 

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ టెక్స్‌టైల్‌ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి 24గంటలు గడవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఐదంతస్తుల .....

Published : 02 Mar 2021 00:55 IST

సూరత్‌లో 24గంటల్లో రెండు అగ్నిప్రమాదాలు

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఓ టెక్స్‌టైల్‌ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి 24గంటలు గడవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి తమ ప్రాణాల్ని కాపాడుకొనేందుకు ఇద్దరు వ్యక్తులు ఒక భవనం నుంచి మరో భవనంపైకి దూకినట్టు అధికారులు వెల్లడించారు. ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో విద్యుత్‌ మీటర్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో పొగలు పైఅంతస్తులకు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొనే లోపే ఓ మహిళ, పురుషుడు భయంతో తమ ఇంటి కిటికీలోంచి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ పైకి దూకినట్టు అగ్నిమాపక శాఖ అధికారి నీలీస్‌ దవే తెలిపారు. ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఇరుకైన ప్రాంతంలో ఈ భవనం ఉండటంతో కింది ఫ్లోర్‌లో చెలరేగిన పొగలు పై అంతస్తులకు వ్యాపించాయని వివరించారు. దాదాపు తొమ్మిది మందిని టెర్రాస్‌పైకి చేర్చి ఆ తర్వాత కిందికి సురక్షితంగా తీసుకొచ్చామన్నారు. ఆరు అగ్నిమాపకశకటాలు ఘటనా స్థలానికి చేరుకొని పది నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారి తెలిపారు.

ఆదివారం రాత్రి 10గంటల సమయంలో పెండేసర పారిశ్రామిక ప్రాంతంలోని టెక్స్‌టైల్‌ మిల్లులోని మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్టు ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి రాజు గైక్వాడ్‌ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి 15 ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపుచేసినట్టు చెప్పారు. ఘటన సమయంలో మిల్లులోపల 12మంది కార్మికులు చిక్కుకోగా.. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలైనట్టు ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని