HYD: అదే నిర్లక్ష్యం.. రోడ్లు రక్తసిక్తం

రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్‌ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. వాహనదారుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. సిగ్నళ్ల వద్ద సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా....

Published : 08 Jun 2021 01:19 IST

సైబరాబాద్‌ పరిధిలోనే 1450 ప్రమాదాలు

సైబరాబాద్‌: రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్‌ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. వాహనదారుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. సిగ్నళ్ల వద్ద సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ట్రాఫిక్‌ పోలీసులు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా రోడ్డు భద్రత నియమాలు పాటించకుండా వాహనాలు నడపుతూ అమాయక ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఈ ఏడాది మే నెలాఖరి వరకు 282 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఈ సంవత్సరం మే నెలాఖరు వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 1450 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 1363 మంది గాయాలపాలయ్యారు. ఇందులో వెనుక నుంచి వాహనాలు ఢీకొట్టిన కేసులే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు పక్క అద్దాలను గమనించకుండా అకస్మాత్తుగా వాహన దిశ మార్చడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. ఈ తరహా ప్రమాదాలు 550 జరగ్గా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 478 మంది గాయపడ్డారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడిపి పాదచారులను ఢీకొట్టిన 282 ప్రమాదాల్లో 79 మంది మరణించారు.

ఎదురెదురుగా వాహనాలు ఢీకొట్టిన ప్రమాదాలు 276 జరగ్గా.. ఇందులో 50 మంది మృత్యువాతపడ్డారు. 345 మంది గాయపడ్డారు. అతివేగం, మద్యం మత్తులో తనంతట తానే వాహనం పైనుంచి కిందపడిపోయిన 183 ప్రమాదాల్లో 50 మంది ప్రాణాలు వదిలారు. 173 మంది గాయపడ్డారు. ఇలా ఈ ఏడాది జరిగిన 1450 రోడ్డు ప్రమాదాల్లో 282 మంది ప్రాణాలు విడిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని