Crime news: వైకాపా నేతలు చంపుతామని బెదిరించారు.. లేఖ రాసి యువకుడి ఆత్మహత్య

ఇద్దరు వైకాపా నేతలు చంపుతామని బెదిరించారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది.

Published : 01 Nov 2021 01:06 IST

నరసరావుపేట: ఇద్దరు వైకాపా నేతలు చంపుతామని బెదిరించారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన పీటర్‌ పాల్‌ (30) గతంలో ఓ యువతిని ఇంటికి తీసుకురాగా.. ఆమె కుటుంబ పెద్దలు అతని ఇంటికి వచ్చి మాట్లాడి యువతిని తీసుకెళ్లారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులు పీటర్‌పాల్‌ చరవాణిలో ఆమెకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయని, వాటిని తొలగించాలని నరసరావుపేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 దీంతో పోలీసులు పీటర్‌పాల్‌ను స్టేషన్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న సెల్‌పోన్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ కోసం ఎన్ని సార్లు స్టేషన్‌కు వచ్చినా అధికారులు ఇవ్వకుండా తిప్పుతున్నారని మృతుని తల్లి శాంతమ్మ ఆరోపించారు. ఈ క్రమంలో యువతి బంధువులు, మరి కొందరు తమ ఇంటిపైకి వచ్చి కుమారుడిపై దాడి చేశారని తెలిపింది. వారిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారని, తనను బతకనివ్వరని పీటర్‌పాల్‌ ఆందోళకు గురయ్యాడని వివరించింది. శుక్రవారం స్టేషన్‌కు వెళ్లిన సమయంలో చొక్కా మర్చుకుని వస్తానని ఇంటికి వెళ్లిన పీటర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. ఆత్మహత్య చేసుకునే ముందు తన చావుకు కొనతం రామకోటేశ్వరరావు, రాకింది పెద్ద నాగేశ్వరరావులు కారణమని లేఖ రాశాడని వెల్లడించింది. తమ కుమారుడు పురుగుల మందు తాగాడని గమనించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించామని, చికిత్స పొందుతూ మృతి చెందాడని పీటర్‌ తల్లి శాంతమ్మ తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని